నటి సంజనకు షరతులతో కూడిన బెయిల్‌..

పలు పార్టీల్లో డ్రగ్స్‌ వినియోగం, విక్రయం కేసులో అరెస్టయిన కన్నడ నటి సంజనకు బెయిల్‌ మంజూరైంది. కర్ణాటక హైకోర్టు శుక్రవారం ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. గత నెలలో సంజనకు బెయిల్‌ నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం.. ఆరోగ్యపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని తాజాగా పలు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను ఈ రోజే జైలు అధికారులకు పంపాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంజన ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది.

షరతులు:

ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో రూ.3లక్షల వ్యక్తిగత బాండ్‌ సమర్పించాలి.

ప్రతి నెల రెండుసార్లు హాజరు కావాలి.

 డ్రగ్స్‌ కేసులో పోలీసుల దర్యాప్తునకు సహకరించాలి.

ఈ కేసులో సాక్ష్యాలను దెబ్బతీసేలా వ్యవహరించరాదు.

డ్రగ్స్‌ వినియోగం, విక్రయం కేసులో కన్నడ తారలు రాగిణి, సంజన తదితరుల అరెస్టుల విషయం విదితమే. డ్రగ్స్‌ కేసులో సెప్టెంబర్‌ నెలలో సంజన, రాగిణిని విచారించిన బెంగళూరు సీసీబీ (సెంట్రల్‌ క్రైంబ్రాంచ్‌) పోలీసులు వారిద్దిరినీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత నెలలో సంజన, రాగిణి సహా మిగతా నిందితులు పెట్టుకున్న బెయిల్‌ దరఖాస్తులను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే, ఆరోగ్యపరమైన సమస్యలను ప్రస్తావిస్తూ తాజాగా సంజన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆమెకు పై షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది.