ఏపీలోని పలువురు స్కూల్ విద్యార్థులకు కరోనా.. మంత్రి స్పందన

కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం లాక్ డౌన్ విధించిన కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడగా ఇటీవల కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తూ ఈనెల 2వ తేదీన ఏపీలోని పాఠశాలలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. 2వ తేదీన పాఠశాలలు తెరవగా కరోనా కారణంగా ఆలస్యంగా తెరుచుకున్న పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంభందించిన వివరాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈనెల 2 వ తేదీన పాఠశాలలు తెరవగా 4వ తేదీ బుధవారం నాటికి ఒక్క కృష్ణా జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 100 శాతం ఉన్నత పాఠశాలలు తెరుచుకున్నాయని అన్నారు. 1, 11, 177 మంది ఉపాధ్యాయులకు 99, 062 మంది పాఠశాలలకు హాజరయ్యారని అన్నారు. దీనితో ఉపాధ్యాయుల హాజరు 89.10 శాతంకు చేరింది. 2వ తేదీన 42 శాతం విద్యార్థులు, 3న 33.69 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరుకాగా.. 4వ తేదీన 40.30 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారని మంత్రి వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు బయటపడుతుండటంపై మంత్రి సురేశ్ స్పందించారు. గతంలోనే వారికి సోకి తెలుసుకోకపోవటం, పాఠశాలల్లో పరీక్షలు చేసినప్పుడు అవి బయటపడుతున్నాయని వివరించారు. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు టెస్ట్‌లు చేస్తున్నారని చెప్పారు. కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్‌లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యమే ప్రధాన ద్యేయంగా అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని… మాస్క్, శానిటైజేషన్, సామజిక దూరం విషయాల్లో రాజీ పడవద్దని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు.