జనసేనతోనే అవినీతి రహిత పరిపాలన

  • ఈ ప్రభుత్వ ఆయుష్షు ఇంకా వందరోజులే
  • జనసేన పిఠాపురం ఇంచార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం: రాష్ట్రంలో అవినీతి లేని పాలన జనసేన పార్టీతోనే సాధ్యం అని, సుపరిపాలన అందించాలనే అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించారని, అవినీతి పాలన చేసే వైస్సార్సీపీ ప్రభుత్వంను తుద్ధముట్టించాలని జనసేన పిఠాపురం ఇంచార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ప్రజల ఆస్తిని దోచుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రణాళిక రూపొందించారని ఆయన ఆరోపించారు. గొల్లప్రోలులోని కరణం గారి తోట వీదిలో ఏర్పాటుచేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందన్నారు. కొత్తగా అప్పులు తెచ్చేందుకు ప్రజల ఆస్తులు సైతం తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇందులో భాగంగానే రైతుల పాస్ బుక్కులలోనూ, పొలం సరిహద్దుల్లోని సర్వే రాళ్లలోనూ జగన్ ఫోటో ముద్రిస్తున్నారని ఆరోపించారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానంతో ప్రజలకు ఒరిజినల్ దస్తావేజులకు బదులు జిరాక్స్ లు మాత్రమే ఇస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వం మరల అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదన్నారు. మద్యపానాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మద్యం షాపులపైనే అప్పులు తెచ్చే స్థాయికి ప్రభుత్వం దిగజారిందని అన్నారు. రాబోయే ఎన్నికలలో వైసీపీకి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని, జనసేన – టిడిపి కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు, మహిళలు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి దాసరి కిరణ్, పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.