17 న సీడబ్ల్యూసీ భేటీ

దేశంలో కొవిడ్‌-19 పరిస్థితిపై చర్చించడానికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ఏప్రిల్‌ 17 న వర్చువల్‌ విధానంలో సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు అధ్యక్షత వహించే ఈ సమావేశానికి పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శులు, ఇతర శాశ్వత ఆహ్వానితులు హాజరు కానున్నారు. దేశంలో ప్రస్తుత కొవిడ్‌-19 పరిస్థితి, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి అత్యవసరంగా తీసుకోవలసిన చర్యలపై సీడబ్ల్యూసి చర్చిస్తుందని, ఉపాధి కోల్పోయిన పేద, అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయంతో పాటు అందరికీ వాక్సిన్లు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. కొవిడ్‌ నియంత్రణకు దేశ వ్యాప్తంగా టీకా డ్రైవ్‌ను వేగవంతం చేయాలని కోరుతూ ఇటీవల సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.