ఏపీలో పరీక్షలు యథాతథం.. విద్యాశాఖ మంత్రి సురేష్‌..

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం యథతథంగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. మే 5 నుంచి 23 వరకు ఇంటర్మీడియట్‌, జూన్‌ 7 నుంచి 16 వరకు టెన్త్‌ పరీక్షలు జరుగుతాయని ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్‌ బోర్డులు షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. సిబిఎస్‌ఇ పరీక్షలు రద్దు నేపథ్యంలో మంత్రి సురేష్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షల నిర్వహణపై సిఎం జగన్‌తో చర్చిస్తామని తెలిపారు. ఇప్పటికైతే యథావిధిగా షెడ్యూల్‌ ప్రకారమే జరిపే ఆలోచనలో ఉన్నామని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని వివరించారు. కరోనా నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.