పారిశుద్ధ్య కార్మికులు కనిపించే దేవుళ్ళు: ఆళ్ళ హరి

  • పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే సమాజానికి పదిరోజులు కూడా మనుగడ ఉండదు. దుర్గంధంతో ప్రజలు అల్లాడతారు
  • కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడటంలో మున్సిపల్ కార్మికులది కూడా కీలకపాత్రే
  • ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ కార్మికులకు జగన్ రెడ్డి ఇచ్చిన మాటని తప్పాడు
  • పారిశుద్ధ్య కార్మికులకు పది రూపాయల జీతం పెంచటానికి చేతులు రాని జగన్ రెడ్డి పేదల పక్షపాతి ఎలా అవుతాడు
  • పారిశుద్ధ్య కార్మికుల కన్నీరు సమాజానికి మంచిది కాదు
  • ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి నిజంగా పేదలపై,కార్మికులపై ప్రేముంటే వాళ్ళకి ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చాలి
  • తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ కలక్టరేట్ ను ముట్టడించిన కార్మికులకు అండగా నిలిచిన జనసేన పార్టీ
  • జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: సూర్యోదయానికి ముందే విధుల్లోకి చేరి ప్రజలు విసర్జించిన మలమూత్రాలను, చెత్తాచెదారాన్ని శుభ్రం చేసి ప్రజలకు ఆయురారోగ్యాలని ప్రసాదించే పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యక్ష దేవుళ్ళతో సమానమని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. కొన్నాళ్లుగా పేరుకుపోయిన తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ సోమవారం జిల్లా సీఐటీయు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలక్టరేట్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు పార్టీ ప్రకటించింది. సీఐటీయు జిల్లా కార్యదర్శి ముత్యాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కార్మికులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేస్తాను అంటూ ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇచ్చిన హామీని నాలుగున్నరేళ్లు దాటుతున్న ఇంతవరకు నెరవేర్చకపోవటం దారుణమని ధ్వజమెత్తారు. కరోనా లాంటి విపత్కర సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన పారిశుద్ధ్య కార్మికుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికులకు పది రూపాయల జీతం పెంచలేని జగన్ రెడ్డి పేదల పక్షపాతినని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పారిశుద్ధ్య కార్మికులు చేసే పనిని మరొకరు చేయలేరని వాళ్ళు పదిరోజులు విధులకు దూరంగా ఉంటే సమాజం మొత్తం దుర్గంధంతో నిండిపోతుందన్నారు. ముఖ్యమంత్రికి నిజంగా పేదలపై ప్రేముంటే కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాలంటూ కోరారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకైనా జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ కార్మిక సంఘ నేత సోమి శంకరరావు, సీఐటీయు జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, రాష్ట్ర రెల్లి యువ సంఘ నాయకులు సోమి ఉదయ్ కుమార్, సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, నండూరి రోశయ్య, కోలా అంజి, వడ్డె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.