నిమిషాల్లో ధనాధన్‌ రిజిస్ట్రేషన్లు

ధరణి రిజిస్ట్రేషన్లు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. మేడ్చల్‌ జిల్లా పరిధిలో మొత్తం 15 తహసీల్దార్‌ కార్యాలయాలు ఉండగా, వీటిలో మూడు తహసీల్దార్‌ కార్యాలయాల పరిధిలో వ్యవసాయ భూముల లేని కారణంగా 13 తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు కీసర రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 8 మండలాల పరిధిలో ఇప్పటికే స్లాట్‌ బుకింగ్‌తో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 45 స్లాట్‌ బుకింగ్‌ కాగా, ఇందులో ఇప్పటికే 41 రిజిస్ట్రేషన్లను నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేశామని, మరో నలుగురి వద్ద డాక్యుమెంట్లు సక్రమంగా లేని కారణంగా రిజిస్ట్రేషన్‌ జరుగలేదని అధికారులు పేర్కొంటున్నారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలు తలెత్తినా.. నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రయను పూర్తి చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.