హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖ అదనపు బాధ్యతలు

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దస్త్రంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంతకం చేశారు.

ఇప్పటి వరకు హరీశ్ రావు ఆర్థిక శాఖను మాత్రమే పర్యవేక్షించేవారు. ఇక నుంచి రెండు శాఖలను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. ప్రస్తుతం ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ వద్దే ఉంది.

గతంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్‌ను క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయడంతో ఆ శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దే ఉండిపోయింది. కరోనా సమయంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా వైద్యారోగ్య శాఖను పర్యవేక్షించారు. ఆరోగ్య రంగం, కరోనా పరిస్థితులు, వసతులు తదితర అన్ని అంశాలపై అధికారులతో పలు దఫాలు సమీక్షలు నిర్వహించారు. కరోనా పరిస్థితులను నిత్యం గమనిస్తూ అధికారులకు సూచనలు చేశారు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి హరీష్‌ రావు వైద్యారోగ్య శాఖకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టారు. కరోనా కట్టడి చర్యలు, ఔషధాలు సమకూర్చుకోవడం, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై పలుమార్లు వైద్యాధికారులతో సమీక్షలు నిర్వహించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులతో సమీక్షలు జరుపుతూ అవసరమైన సూచనలు చేశారు. వ్యాక్సిన్ల కొరత లేకుండా ఉండేందుకు రాష్ట్రానికి ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్లు కేటాయించాలని కోరేలా అధికారులకు సూచనలు చేశారు.

వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి నెల వారీ లక్ష్యాన్ని నిర్దేశించి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేలా కృషి చేశారు. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరిగిన సందర్భంలో స్వయంగా కోఠిలోని ఇఎన్‌టీ ఆసుపత్రి సందర్శించి, అక్కడ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. కరోనా కట్టడి చర్యలు పకడ్బందీగా అమలు చేయడంలో, బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డ వారికి సకాలంలో చికిత్స అందించడంలో ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో హరీష్‌రావుకే వైద్యారోగ్య శాఖను కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.