నేడే సీఎంగా దీదీ ప్రమాణం..

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జగదీప్ ధన్‌కడ్ ఇవాళ ఉదయం 10.45 గంటలకు దీదీతో ప్రమాణం చేయించనున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో.. కొద్దిమందితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీదీతో పాటూ పలువురు సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని సమాచారం. ఎనిమిది విడతలుగా జరిగిన ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హ్యాట్రిక్ విజయంతో బెంగాల్‌లో మూడోసారి అధికారంలో వచ్చిన విషయం తెలిసిందే.

నిన్న కోల్‌కతాలో జరిగిన పార్టీ సమావేశంలో టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని శాసనసభాపక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రోటెమ్ స్పీకర్‌గా సుబ్రతా ముఖర్జీ వ్యవహరించనున్నారు. కాగా, మమతా బెనర్జీ.. నందిగ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారిపై ఓడిపోయారు. అయినా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆమె ఆరు నెలల లోపు ఎక్కడో ఒకచోట ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. బీజీపీ, టీఎంసీ మధ్య హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 213 అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ విజయం సాధించగా, బీజేపీ 77 స్థానాల్లో గెలుపొందింది.