న్యూజెర్సీనీ ముంచెత్తిన భారీ వానలు

ఐదా హరికేన్‌ ధాటికి అమెరికాలోని న్యూయార్క్‌ అతలాకుతలమైంది. భారీగా కురుస్తున్న వర్షాలు, వరదలకు 44 మంది చనిపోయారు. రికార్డు స్థాయిలో వర్షాలు కురువడంతో న్యూయార్క్‌ నగరమంతా వరదల్లో చిక్కుకుంది. వీధులన్నీ నదులను తలపించాయి. నీరు ఫ్లాట్‌ ఫారమ్‌ల్లోని ట్రాక్‌లపైకి ప్రవహించడంతో సబ్‌ వే సర్వీసులను నిలిపివేశారు. లాగార్డియా, జెఎఫ్‌కె, నెవార్క్‌ విమానాశ్రయాల్లో వందలాది విమాన సర్వీసులను నిలిపివేశారు. న్యూయార్క్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు చూస్తున్నానని 50 ఏళ్ల వ్యక్తి.. రెస్టారెంట్‌ యాజమాని తెలిపారు. ఆయన రెస్టారెంట్‌ బేస్‌మెంట్‌ మూడు అంగుళాల నీటిలో మునిగిపోయింది. ఈ అకాల వర్షాలపై అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. ఐదా తుఫాన్‌ ధాటికి జరిగిన భారీ నష్టం పట్ల సాయం చేయడానికి దేశమంతా సిద్ధంగా ఉందని లూసియానా పర్యటనకు ముందు తెలిపారు.
న్యూయార్క్‌తోపాటు న్యూజెర్సీనీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. న్యూజెర్సీలో భారీ వానలకు కనీసం 23 మంది చనిపోయి ఉంటారని గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ విలేకరులతో అన్నారు. మంమన్హాటన్‌, దిబ్రోంక్స్‌, క్వీన్స్‌లోని ప్రధాన రహదారులన్నీ జలమయ్యాయి. రోడ్లపై ఉంచిన కార్లన్నీ నీటమునిగాయి. మరణాల్లో అనేక మంది తమ వాహనాల్లో చిక్కుకుని చనిపోయారని అన్నారు. పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌లో ఓ జలాశయంలోకి ప్రమాదకరస్థాయిలో నీరు చేరడంతో స్థానికులను ఖాళీ చేయించారు. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ల్యారీ తుపాను అంతకంతకూ బలపడుతోందని, శనివారం కల్లా అది ఇడా స్థాయిలో తీవ్రరూపు దాల్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.