పార్వతీపురంలో మురికి పాలన…!

పార్వతీపురంలో మురికి పాలన సాగుతోందని జనసేన పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీలోని మురుగు కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. బుధవారం జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, తామరఖండి తేజ, పసుపు రెడ్డి పూర్ణచంద్ర ప్రసాద్, కె.సత్యనారాయణ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మున్సిపాలిటీలోని మురుగు కాలువల్లో గత కొంతకాలంగా మురుగు తొలగించకపోవడంతో ఆయా కాలువల్లో మురుగు పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోందన్నారు. అంతే కాకుండా దోమలు, ఈగలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. వర్షాకాలం కంటే పార్వతీపురంలో ఇప్పుడే ప్రజల్ని దోమలు వేధిస్తున్నాయన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా వీధుల్లో ఇళ్లల్లో దోమలు ప్రజలను రఫ్ఫాడిస్తున్నాయన్నారు. మురుగు కాలువల్లో మురుగు తీత పనులు చేపట్టకపోవడంతో దోమలు అధికంగా పెరిగాయన్నారు. మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా తదితర రోగాల భారిన ప్రజలు పడుతున్నారన్నారు. మున్సిపాలిటీలో గల 30 వార్డులకు చెందిన ఆయావీధుల్లోని మురుగు కాలువల్లో కూడిక తీత పనులు చేపట్టకపోవడంతో మున్సిపాలిటీ మురికి కంపు కొడుతోందని ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీలో దోమల నివారణకు చర్యలు చేపట్టే దాఖలాలు కానరావడం లేదన్నారు. నీటి నిల్వలున్నచోట ఆయిల్ బాల్స్ వేయటం, ఏసియఎం, ఎబెట్ తదితర క్రిమి సంహారక మందులు పిచికారి చేయించడం తదితర చర్యలు శూన్యం అన్నారు. కనీసం ఫాగింగ్ కార్యక్రమం కూడా కానరావడం లేదన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలో పాలన అటకెక్కిందన్నారు. జిల్లా కేంద్రంగా మారిన ప్రజలకు దోమల బాధ తప్పడం లేదన్నారు. దోమల కోసం ప్రజలు తన ఆదాయంలో కొంత మొత్తాన్ని కేటాయించి దోమల నివారణకై లిక్విడ్స్, క్వాయుల్స్, బ్యాట్లు తదితరవి దినచర్యలో భాగంగా కొనుక్కునే దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గాడి తప్పిన పురపాలను గాడిలో పెట్టాలన్నారు.