లగేజ్ తక్కువుంటే విమాన టిక్కెట్ ధరల్లో డిస్కౌంట్

లెస్ లగేజ్..మోర్ కంఫర్ట్. ఇది నిన్నటి వరకూ విన్పించిన మాట. ఇప్పుడు లెస్ లగేజ్..లెస్ ప్రైస్. అది కూడా విమానాల్లో నిజమే. లగేజ్ తక్కువుంటే దేశీయ విమాన టిక్కెట్ ధరల్లో డిస్కౌంట్ లభించనుంది.

దేశీయ విమాన ప్రయాణాలు చేసేవారికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. తక్కువ లగేజ్‌తో ప్రయాణం చేస్తే టిక్కెట్ ధరలో డిస్కౌంట్ పొందే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. లెస్ లగేజ్..లెస్ ప్రైస్ అన్న మాట. కేవలం కేబిన్ లగేజ్‌తో ప్రయాణించేవారికి దేశీయ విమాన టిక్కెట్ ధరల్లో డిస్కౌంట్ ఇవ్వడానికి డీజీసీఏ అనుమతిచ్చింది. అంటే ఇకపై ఎక్కువగా లగేజ్ లేకపోయినా లేదా చిన్న బ్యాగుతోనే ప్రయాణించాలనుకున్నా సరే టిక్కెట్ ధర ఇక చౌకగా లభించనుంది. సాధారణంగా కేబిన్ లగేజ్ కింద 7 కేజీలు, చెక్‌ఇన్ లగేజ్‌గా 15 కేజీలు తీసుకెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ బరువుంటే అదనపు ఛార్జీలు ఉంటాయి. మరి నిర్ణీత బరువు కంటే తక్కువ ఉంటే తక్కువ ధర వసూలు చేసేలా సౌకర్యం ఉంటుందిక.

ఈ కొత్త ప్రైస్ విధానం అమల్లో వస్తే దేశీయ విమాన ప్రయాణీకులు టిక్కెట్ బుకింగ్ సమయంలోనే తమ లగేజ్‌ను స్పష్టం చేయాల్సి ఉంటుంది. తక్కువ లగేజ్ ఉన్నవారికి టిక్కెట్ డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ప్రత్యేకంగా ఒక సీటు కావాలన్నా లేదా భోజనం, స్నాక్స్ వంటివి అడిగినా, మ్యూజిక్ వినాలన్నా సరే విమానయాన సంస్థలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ సర్వీసులు లేకపోతే మాత్రం టీకెట్ ధర తగ్గుతుంది. అదే విదంగా తక్కువ లగేజ్ ఉంటే టికెట్ తగ్గించే అవకాశాన్ని డీజీసీఏ  ప్రయాణీకులకు కల్పించింది. విమానయాన సంస్థల్ని నష్టాల్నించి బయటపడేయడానికి కేంద్రం ఇటీవలే విమాన ఛార్జీలను 10-30 శాతం పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడీ కొత్త విధానంతో కాస్త ఊరట కలగవచ్చు.