నా రేంజ్ మీకు తెలుసా అంటూ వీరంగం చేసిన షణ్ముఖ్..!

ఒక్కోసారి మనం తెలియకుండా చేసే తప్పులకు శిక్ష చాలా దారుణంగా పడుతుంది. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మద్యం తాగి వాహనం నడిపి ఆయన చేసిన ఒక చిన్న యాక్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇది జరిగి రెండు రోజులు అవుతున్నా ఇప్పటికీ మనోడి పేరు ట్రెండింగ్ లోనే ఉంది. అయితే పోలీసులు అదుపులోకి వెళ్ళిన తర్వాత షణ్ముఖ్ చెప్పిన కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆ సమయంలో ఈయన ఎంత మద్యం సేవించాడు.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనేది ఈ మాటలను బట్టి అర్థమైపోతుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా తాను ఒక పెద్ద స్టార్ అని ప్రమోట్ చేసుకుంటున్న మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నా రేంజ్ ఏంటో తెలుసా మీకు అంటూ కొంత మందితో ఫోన్లు చేయించే ప్రయత్నాలు కూడా చేశాడు ఈయన. అయితే పోలీసులు దీనికి ససేమిరా అనడంతో చివరికి సైలెంట్ అయ్యాడు షణ్ముఖ్. నా ఒక్కొక్క వీడియోకు కోటి వ్యూస్ వస్తాయి తెలుసా.. నా రేంజ్ ఏంటో మీకు అర్థం కావడం లేదు అంటూ అక్కడ నానా బీభత్సం చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు ఎవరికీ ఏం కాలేదు కదా.. ఎవరు హాస్పిటల్లో జాయిన్ కాలేదుకదా అంటూ ఆయన మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ కేసులో షణ్ముక్ పై 10 వేల జరిమానాతో పాటు కౌన్సిలింగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.