చైనా కంపెనీ యాప్‌లపై వెనక్కి తగ్గేది లేదన్న డొనాల్డ్ ట్రంప్

టిక్‌టాక్ యాప్‌ను అమెరికాలో విక్రయించడానికి నిర్ణయించిన గడువు ను పొడిగించే ప్రసక్తే లేదని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డ్యాన్స్‌కు మరోసారి తన ఉద్దేశాన్ని వెల్లడించారు. అమెరికాలో కంపెనీ మూయడమా.. లేక విక్రయించడమా.. ఏదైనా నిర్ణీత గడువులోగా తేల్చుకోవాలని లేని పక్షంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని మీడియా సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు.

వాస్తవానికి తనకు ఈ విషయంలో ప్రేరణ కలిగించింది భారత్ అని కొన్ని రోజుల కిందట ట్రంప్ వెల్లడించారు. భారత్‌లో చైనా కంపెనీ యాప్‌లపై నిషేధం విధించి మంచి పని చేసిందన్నారు. అదే విధంగా అమెరికా సెక్యూరిటీ, పౌరుల సమాచార గోప్యతకు భంగం వాటిల్లుతుందన్న అనుమానాలు, సందేహాలతో టిక్‌టాక్‌ను డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో నిషేధించడం తెలిసిందే. అయితే అమెరికా కంపెనీకి టిక్‌టాక్ విక్రయిస్తే తనకే అభ్యంతరం లేదని, లేని పక్షంలో పూర్తి స్థాయిలో టిక్‌టాక్‌ను తమ దేశంలో నిషేధిస్తామని చైనా కంపెనీ బైట్ డ్యాన్స్‌ను ట్రంప్ హెచ్చరించడం తెలిసిందే.