సచివాలయ ఉద్యోగుల రాత పరీక్షల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్

ఆంద్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 30 కి.మీ. దూరం మించకుండా పరీక్ష కేంద్రాలను కేటాయించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మహిళా అభ్యర్థులతో పాటు మొత్తం 4.57 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకున్న కేటగిరి–1 ఉద్యోగాల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని అధికారులు రాత పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. సెరికల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కేవలం 680 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో జిల్లాకొక కేంద్రంలోనే ఆ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 20 – 26వ తేదీల మధ్య ఏడు రోజుల పాటు రెండు పూటలా 14 రకాల రాతపరీక్షలు జరుగనుండగా.. మొత్తం 16,208 ఉద్యోగాలకు 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు రవాణా ఇబ్బందులు పడకుండా రాత పరీక్షల సమయంలో అన్ని ప్రాంతాలకు బస్సులు నడపాలంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఇప్పటికే లేఖ రాశారు. అలాగే పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌టికెట్లపై ఉన్న నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈనెల 12వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్‌ wardsachivalayam.ap.gov.in/ , gramasachivalayam.ap.gov.in/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.