ఇది జనవిజయం.. వారికే అంకితం- ఈటల

హూజూరాబాద్ ఉప ఎన్నికలో తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపును హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలకు అంకితం చేశారు ఈటల. హుజూరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార వర్గాల బెదిరింపులకు నియోజకవర్గ ప్రజలు భయపడలేదని ఈటల అన్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు నిజాయతీగా పని చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలను ప్రలోభాలకు గురి చేయాలని చూసింది. ఉప ఎన్నికల్లో భారీగా డబ్బులు, మద్యం పంపిణీ చేశారని అన్నారు. హుజూరాబాద్‌లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. అన్నింటినీ పరిశీలించిన హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు టీఆర్ఎస్ అహంకారాన్ని బొంద పెట్టారని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో తీసుకువచ్చిన దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఈటల రాజేందర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే దళిత బంధు తరహాలో అన్ని వర్గాలకు ఆర్థిక చేయూత ఇవ్వాలన్నారు. నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో పెన్షన్లు ఇచ్చినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం అంతా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.