‘ప‌ది’పోయిన‌… విద్యావ్య‌వ‌స్థ‌!

* ప‌దో త‌ర‌గ‌తిలో ఘోర‌మైన ఫ‌లితాలు
* ఇర‌వై ఏళ్ల‌లో అత్య‌ల్ప ఉత్తీర్ణ‌త‌
* ఏపీ స‌ర్కారు విధానాలే కార‌ణం
* ల‌క్ష‌లాది విద్యార్థుల మ‌న‌స్తాపం
* తీవ్ర నిరాశ‌లో త‌ల్లిదండ్రులు

“పంచ పాండ‌వులు మంచం కోళ్లలా ముగ్గురు..” అంటూ రెండు వేళ్లు చూపించి బోర్డు మీద ఒక‌టి వేసి చెరిపేశాడ‌ట ఓ ఉపాధ్యాయుడు…”
అచ్చం ఇలాగే ఉంది ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం విద్యావిధానం!
ఇదేదో స‌ర‌దాగా చెప్పుకునే సంగ‌తి కాదు…
లక్ష‌లాది మంది విద్యార్థుల‌, త‌ల్లిదండ్రుల ఆవేద‌న‌కు సంబంధించిన విష‌యం!
గ‌త ఇర‌వై ఏళ్ల‌లో ఎన్న‌డూ లేనంత‌గా ప‌ద‌వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త ప‌డిపోయింది…
అంటే మ‌రో విధంగా చెప్పాలంటే… వైకాపా హ‌యాంలో విద్యావ్య‌వ‌స్థ 20 ఏళ్ల వెన‌క్కి దిగ‌జారింద‌న్న‌మాటే!
ఏపీలో మొత్తం 6,15,908 మంది విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాశారు. వారిలో ఏకంగా 2,01,627 మంది ఫెయిల్ అయ్యారు.
ఇంత మంది ఫెయిల్ కావ‌డం గ‌త 20 ఏళ్ల‌లో ఎన్న‌డూ లేదు. ఉత్తీర్ణ‌తా శాతం కేవ‌లం 67.26 శాత‌మే.
ఏ ప‌రీక్ష‌లోనైనా కొంద‌రు విద్యార్థులు ఫెయిల్ అవుతుండ‌డం సాధార‌ణ‌మైన విష‌య‌మే. అయితే నూటికి ఓ అయిదారుగురు త‌ప్ప మిగ‌తా వారంద‌రూ ఉత్తీర్ణులైతే అది చ‌క్క‌ని విద్యావ్య‌వ‌స్థ‌కి గీటురాయిగా నిలుస్తుంది.
కానీ నూటికి ఏకంగా 33 మంది ఫెయిల్ అయితే?
ప‌రీక్ష రాసిన ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రు విఫ‌లం అయ్యారంటే?
అది క‌చ్చితంగా విద్యావ్య‌వ‌స్థ లోప‌మ‌నే చెప్పాలి.
ఉదాహ‌ర‌ణ‌కు ఒక స్కూలులో ఒక త‌ర‌గ‌తిలో 60 మంది విద్యార్థులు ఉన్నార‌నుకుందాం. వారిలో ఏకంగా 20 మంది స‌రిగా చ‌దువుకోలేక‌పోయారంటే ఆ లోపం ఎవ‌రిది?
క‌చ్చితంగా క్లాస్ టీచ‌ర్‌దే. ఆ క్లాస్ టీచ‌ర్ స‌రిగా పాఠాలు చెప్ప‌లేద‌నే అర్థం. చ‌దువు చెప్పే త‌న బాధ్య‌త‌ను స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌లేద‌నే అర్థం. విద్యార్థుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తీవ్ర నిర్లక్ష్యం చూపించార‌నేదే అర్థం.
ఇప్పుడు ఇదే సూత్రం ఏపీలో విద్యా వ్య‌వ‌స్థ‌కి వ‌ర్తిస్తుంది. ఆ విద్యా వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్ట‌లేని అధికార యంత్రాంగానికి వ‌ర్తిస్తుంది. దాన్ని ప‌ర్య‌వేక్షించ‌లేని పాల‌క వ‌ర్గానికి వ‌ర్తిస్తుంది. అధికార‌, పాల‌న రంగాల‌ను స‌క్ర‌మంగా న‌డిపించ‌లేని జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ‌ర్తిస్తుంది. ఏపీలో జ‌రిగిందిదే. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష్ల‌ల్లో అనుత్తీర్ణ‌త శాతం 32.74 గా నిలిచింది.
నిజానికి స‌మైక్యాంధ్ర చ‌రిత్ర‌లో సైతం ఇదే అతి త‌క్కువ పాస్ ప‌ర్సంటేజీగా న‌మోదైంది. ఇదే ఇప్పుడు ల‌క్ష‌లాది విద్యార్థుల‌, త‌ల్లిదండ్రుల్లో ఆవేద‌న‌కు కార‌ణ‌మైంది.
*ఈ పాపం ఎవ‌రిది?
“ఉన్న‌త‌మైన విద్య అంటే దేశంలోని విద్యార్థులంద‌రూ ఏపీ కేసి చూడాలి. అలా విద్యావ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్దాలి…” అంటూ ఓ స‌మీక్షా స‌మావేశంలో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సుద్దులు చెప్పారు. కానీ ఆద‌ర్శాలు వ‌ల్లించ‌డ‌మే కానీ, ఆచ‌ర‌ణ శూన్య‌మైన జ‌గ‌న్ స‌ర్కారు, ప్రాథ‌మికోన్న‌త విద్యా వ్వ‌వ‌స్థ నిర్వ‌హ‌ణ‌లోనే ఘోరంగా ఫెయిల్ అయింది. అందుకు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలే నిద‌ర్శ‌నం.
“కొవిడ్ ప‌రిస్థితుల కార‌ణంగా ఇలాంటి ఫ‌లితాలు వ‌చ్చాయి…” అంటూ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఆ మాట‌లు ల‌క్ష‌లాది మంది విద్యార్థుల‌, త‌ల్లిదండ్రుల ఆవేద‌న‌ను ఏమాత్రం చ‌ల్లార్చ‌వ‌న‌డంలో సందేహం లేదు. ఎందుకంటే జ‌గ‌న్ స‌ర్కారు హ‌యాంలో విద్యావ్య‌వ‌స్థ ఎలా భ్ర‌ష్టు ప‌ట్టిందో ఏ త‌ల్లిదండ్రుల‌న‌డిగినా ట‌క‌ట‌కా చెబుతారు.
నిజానికి క‌రోనా ప‌రిస్థితుల వ‌ల్ల పాఠ‌శాల‌లు మూత ప‌డ్డం, ఆన్‌లైన త‌ర‌గ‌తులు జ‌ర‌గ‌డం, వాటిని విద్యార్థులు స‌రిగా అర్థం చేసుకోలేక‌పోవ‌డం…. ఇవ‌న్నీ కూడా కొంత‌వ‌ర‌కు కార‌ణాలే అయిన‌ప్ప‌టికీ… పూర్తిగా వాటి మీద‌కే నెపం నెట్టేయ‌డం మాత్రం భావ్యం కాద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.
క‌రోనా విజృంభ‌ణ వ‌ల్ల గ‌త రెండేళ్లుగా అస‌లు ప‌రీక్ష‌లే నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డినా, ఆ త‌ర్వాత‌ క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఈ విద్యా సంవ‌త్స‌రం బాగానే త‌ర‌గ‌తులు జ‌రిగాయి. రెండు నెల‌లు ఆల‌స్యంగా పాఠశాల‌లు ప్రారంభ‌మైనా, ఆగ‌స్టు నుంచి ప‌రీక్ష‌లు జ‌రిగేంత‌వ‌ర‌కు నిరాటంకంగానే జ‌రిగాయి. అలాగే సిల‌బ‌స్‌ను కూడా కొంత మేర‌కు త‌గ్గించారు. అందువ‌ల్ల కేవ‌లం క‌రోనాను సాకుగా చూపి విద్యావ్య‌వ‌స్థ‌లో పేరుకుపోయిన లోపాల‌ను స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం పాల‌కుల‌కు స‌బ‌బు కాద‌ని విద్యానిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు.
*భ్ర‌ష్టు ప‌ట్టిన విధంబెట్టిద‌నిన‌…
ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల నేప‌థ్యంలో ఏపీ విద్యా విధానాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించిన కార‌ణాల‌ను విశ్లేషించి చూస్తే… పాల‌నాప‌ర‌మైన లోపాలు, విధాన ప‌ర‌మైన తప్పిదాలు అనేకం క‌నిపిస్తాయి.
* ఏపీలో మొత్తం 11,671 పాఠ‌శాల‌లు ఉన్నాయి. అయితే వీటిలో ఉపాధ్యాయుల కొర‌త అధికంగా ఉంది. ఉన్న‌త పాఠ‌శాలల్లో సుమారు 10,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఉన్న‌త పాఠ‌శాల‌లుగా ఉన్న‌తీక‌రించిన 500 స్కూళ్ల‌కు అస‌లు ప్ర‌ధానోపాధ్యాయులే లేరు. ఇలా వేల సంఖ్య‌లో ఖాళీలు ఉన్న‌ప్ప‌టికీ వాటిని భ‌ర్తీ చేయ‌డంలో నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఫ‌లితంగా ఉన్నత త‌ర‌గ‌తుల్లో స‌బ్జెక్టును బోధ‌ప‌రిచే నిపుణులు లేకుండాపోయారు. మ‌రి ఈ బాధ్య‌త ఎవ‌రిది?
* ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్న‌ప‌త్రం మోడ‌ల్ ను మార్చ‌డంలో కూడా స‌రైన శ్ర‌ద్ధ చూపించ‌లేద‌ని అనేక మంది త‌ల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో నాలుగో, అయిదో ప్ర‌శ్న‌లిచ్చి వాటిలో రెండింటికి స‌మాధానం రాయ‌మ‌నేవారు. అందువ‌ల్ల విద్యార్థికి ఛాయిస్ ఎక్కువ‌గా ఉండేది. అయితే ఈసారి ఈ విధానాన్ని మార్చేశారు. కేవ‌లం రెండు ప్ర‌శ్న‌లిచ్చి వాటిలో ఒక‌టి రాయాల‌నే ప‌ద్ధ‌తి ప్ర‌వేశ‌పెట్టారు. ఇందువ‌ల్ల ఛాయిస్ స‌గానికి స‌గం త‌గ్గిపోయిన‌ట్ట‌యింది. మ‌రో వైపు చిన్న ప్ర‌శ్న‌ల‌కు అస‌లు ఛాయిస్ లేకుండా చేశారు. ఇలా మోడ‌ల్ మార్చేట‌ప్పుడు స‌రైన చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. మ‌రో వైపు ప‌రీక్ష సమ‌యాన్ని కూడా కుదించారు. అలాగే 2019 వ‌ర‌కు 11 పేప‌ర్లు ఉండ‌గా వాటిని ఏడుకు త‌గ్గించారు. గ‌తంలో ఒక పేప‌ర్ ను స‌రిగ్గా రాయ‌లేక‌పోయినా, రెండో పేప‌ర్‌లో ఆ లోపాన్ని క‌వ‌ర్ చేసుకునే అవ‌కాశం ఉండేది. ఈసారి ఒకే పేప‌ర్ కావ‌డంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. వంద మార్కుల‌కు ఒకేసారి స‌న్న‌ద్ధం కావ‌ల‌సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక గ‌తంలో బిట్ పేప‌ర్ ఉండ‌గా దాన్ని ఈసారి తొల‌గించారు. ఇలాంటి మార్పుల‌పై విద్యార్థుల‌కు ముందు నుంచీ అవ‌గాహ‌న క‌లిగించాల‌నే స్పృహ ప్ర‌భుత్వాధికారుల్లో లోపించింది. మ‌రి ఈ లోపం ఎవ‌రిది?
* సాధార‌ణంగా ఒక స్కూలులో ఉపాధ్యాయులు ఏంచేస్తారు? పాఠాలు చెబుతారు. ప్ర‌ధానోపాధ్యాయుడు ఏం చేస్తారు? టీచ‌ర్లు స‌రిగ్గా చెబుతున్నారో లేదో, ఆ పాఠాలు విద్యార్థుల‌కు స‌రిగా అర్థ‌మ‌వుతున్నాయో లేదో నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తుంటారు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల బోధ‌న సిబ్బందికి బోధ‌నేత‌ర ప‌నుల‌ను అంట‌గ‌ట్టారు. ఉపాధ్యాయులకు ‘నాడు నేడు’ ప‌థకానికి సంబంధించిన ప‌నులు అప్ప‌గించారు. కొన్ని చోట్ల మ‌ద్యం షాపుల‌కు కాప‌లా ప‌నికి సైతం ఉపాధ్యాయుల‌నే వాడుకున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక ప్ర‌ధానోపాధ్యాయుల‌కు మ‌రుగుదొడ్ల శుభ్ర‌త‌, వాటికి ఫొటోలు తీయడం, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కానికి ఫొటోలు తీయ‌డం, ఆన్‌లైన్ హాజ‌రు న‌మోదులాంటి యాప్‌ల‌కు సంబంధించిన ప‌నులు కేటాయించారు. ఫ‌లితంగా టీచ‌ర్లు పాఠాలు చెప్పే స‌మ‌యం, హెడ్మాస్ట‌ర్లు ప‌ర్య‌వేక్ష‌ణ చేసే స‌మ‌యాల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించేశారు. మ‌రి ఈ అనాలోచిత నిర్ణ‌యాల‌కు బాధ్య‌త ఎవ‌రిది?
* ఇక ప‌గ‌లంతా స్కూల్లో పాఠాలు విన్న విద్యార్థులు సాయంత్రం ఇంటికి వ‌చ్చి చ‌దువుకుందామంటే విప‌రీత‌మైన కరెంటు కోత‌లు వేధించాయి. ఓప‌క్క ఉక్క‌పోత‌, మ‌రో పక్క గుడ్డి దీపం వెలుగుల మ‌ధ్య‌నే విద్యార్థులు చ‌దువుకోవాల‌సిన ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి. కీల‌క‌మైన ప‌రీక్ష‌ల వేళ‌ల్లో క‌రెంటుకు అంత‌రాయం లేకుండా చూసుకోవ‌ల‌సిన ప్ర‌భుత్వం ఆ సంగ‌తినే ప‌ట్టించుకోలేదు. మ‌రి ఈ నిర్లక్ష్యం ఎవ‌రిది?
* ఎలాగోలా క‌ష్ట‌ప‌డి చ‌దువుకున్న విద్యార్థులు త‌మ ప‌రిజ్ఞానాన్ని ప్ర‌ద‌ర్శించే ప‌రీక్ష‌ల‌కు ఉత్సాహంగా హాజ‌ర‌యిన తొలి నాటి నుంచీ ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజి వ్య‌వ‌హారం తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. రోజుకో పేప‌రు వంతున లీక‌వుతూ అటు విద్యార్థుల‌ను, ఇటు త‌ల్లిదండ్రుల‌ను కూడా ఆవేద‌న‌కు గురి చేసింది. అలాగే ప్ర‌శ్నా ప‌త్రాల త‌యారీలో కూడా అనేక లోపాలు, త‌ప్పులు చోటు చేసుకున్నాయి. మ‌రి ఈ నిర్వ‌హ‌ణ లోపం ఎవ‌రిది?
ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ జ‌వాబు ఒక‌టే… అదే జ‌గ‌న్ ప్ర‌భుత్వం విద్యా విధానంపై చూపిన అల‌స‌త్యం! ప్ర‌భుత్వ ప‌రంగా, పాల‌న ప‌రంగా పేరుకుపోయిన ఉదాసీన‌త‌, నిర్ల‌క్ష్యాలు… ఇప్పుడు ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులైన‌ ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రు త‌ల‌దించుకునేలా చేసింది. వారి త‌ల్లిదండ్రుల‌లో ఆవేద‌న‌కు కార‌ణ‌మైంది. అనేక కుటుంబాల‌ను త‌ల్ల‌డిల్లేలా చేసింది. ఇప్పుడు వారిలో ఏ ఒక్క‌రిని అడిగినా కూడా ఒక‌టే చెబుతారు… అదే జ‌గ‌న్ స‌ర్కార్ ఫెయిల్ అయింద‌ని!!