రాష్ట్ర పరిస్థితిపై పెద్దలు దృష్టి సారించాలి!

  • సుమారు 25 రోజులుగా ప్రతిపక్షాల నిరసనలు, ఆందోళనలు
  • ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా రాని దుస్థితి
  • ధరలు పెరుగుదల.. భద్రత కోసం ఉద్యోగుల ఆందోళన
  • రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంపై మేధావులు నోరు విప్పాలి
  • రాష్ట్ర అనిశ్చితిపై కేంద్రం కలుగజేసుకోవాలి
  • టిడిపి నిరసన దీక్షలో జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం: ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై పెద్దలు దృష్టి పెట్టాలని జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు కోరారు. ఆదివారం పట్టణ మెయిన్ రోడ్డులో టిడిపి నాయకులు చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు ఆరోగ్యకరంగా లేవన్నారు. దాదాపు 25 రోజులుగా రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాలు నిరసనలు, ఆందోళన చేపడుతున్నా ప్రభుత్వం కానీ, వ్యవస్థలు కానీ సమస్యను పరిష్కరించే చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ప్రతిపక్షాలు గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంలో అరెస్టులు వేధింపులు చేయటం సరికాదన్నారు. బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే పాలన ప్రజా రంజికంగా జరుగుతుందన్నారు. ప్రతిపక్షం నోరునొక్కి పాలను సాగించాలన్న రాజకీయ దురుద్దేశం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ఆంధ్ర ప్రజలు అమాయకులు కాదని, వారు అంతా గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. వ్యవస్థలను నడిపే ఉన్నతాధికారులు, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఈ విషయాన్ని గమనించాలి అన్నారు. పాలన తప్పుదారి పట్టేటప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన పెద్దలు నోరు మెదపకపోవడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లించలేని దుస్థితికి ప్రభుత్వ పాలన చేరుకుందన్నారు. సుమారు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. ఇది ప్రజా పాలనకు వ్యతిరేకమన్నారు. ఓవైపు నిరుద్యోగిత, మరోవైపు ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు, ధరల పెరుగుదల తదితరవి చూస్తుంటే రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో ఉందన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ దాదాపు బలహీనపడ్డాయన్నారు. ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం …అన్నట్టు పరిజ్ఞానం లేని వారి పాలనలో ఆయా శాఖలు అభివృద్ధి సాధించలేకపోతున్నాయన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణాలు పూర్తిగా కాక, పరిశ్రమలు రాక, రోడ్లు బాగుపడక , ఇలా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్న పాలన రాష్ట్రానికి మంచిది కాదన్నారు. తక్షణమే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులపై కేంద్రంతో పాటు వ్యవస్థలు దృష్టి సారించి గాడిలో పెట్టాలన్నారు. ముఖ్యంగా మేధావులు, ప్రజలు రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి భవిష్యత్తుపై ఆలోచించాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే శ్రీలంక, హితోఫియా, పాకిస్తాన్ దేశాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా చేరే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విడుదల చేసి రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దాలని ఆయన కోరారు. పాలకులు ప్రతిపక్షాలను వేధించడం ఆపి పాలనపై దృష్టి సారించాలన్నారు .ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పసుపురెడ్డి పూర్ణచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.