ఏలూరు వింత వ్యాధి సమస్య గుంటూరు జిల్లాలో మొదలైంది

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కలకలం రేపిన వింత వ్యాధి సమస్య ఇప్పుడు గుంటూరు జిల్లాలో మొదలైంది. దాచేపల్లి మండలం నడికుడిలో పలువురు స్పృహ తప్పి పడిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గ్రామానికి చెందిన పల్లపు రామకృష్ణ (26) స్పృహ తప్పి పడిపోవడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఇదే విధంగా ఇటీవల మరో ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగానే అనారోగ్యానికి గురవుతున్నామని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.