వైఎస్ వివేకా హత్య వెనుక పెద్దలు.. దస్తగిరి వాంగ్మూలంతో వెలుగులోకి సంచలన విషయాలు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప సబ్ కోర్టు ఆదేశాలతో వివేకా మాజీ డ్రైవర్, నిందితుడు దస్తగిరి వాంగ్మూల పత్రాన్ని న్యాయవాదులకు అందజేశారు సీబీఐ అధికారులు. దీంతో సంచలన విషయాలు వెలుగుచూశాయి.

వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి వాంగ్మూలం

ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డితో కలిసి వివేకా హత్యలో పాల్గొన్నా. ఎర్ర గంగిరెడ్డి హత్యకు ప్లాన్ చేశాడు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో రగిలిపోయాడు గంగిరెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర వాగ్వాదం జరిగింది. నన్ను కావాలనే ఓడించారు మీ కథ తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్, భాస్కరరెడ్డి, శంకర్ రెడ్డిలకు వివేకా వార్నింగ్ ఇచ్చారు. గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్ రెడ్డిని ఆఫీసుకు పిలిపించి తిట్టారు. తర్వాత కొన్ని రోజులపాటు వివేకా, గంగిరెడ్డి మధ్య మాటలు లేవు. వివేకాను హత్య చేయాలని గంగిరెడ్డి నాకు ఆఫర్ చేశాడు. నువ్వొక్కడివే కాదు, మేమూ వస్తాం కలిసే వివేకాను చంపేద్దామని గంగిరెడ్డి చెప్పాడు. దీని వెనుక అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి ఉన్నారని గంగిరెడ్డి చెప్పాడు. మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయల సుపారీ. నాకు 5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి ఇచ్చిన అడ్వాన్స్ లో 25 లక్షలు సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడు. నా స్నేహితుడు మున్నా దగ్గర మిగతా 75 లక్షలు దాచాను. సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర కుక్కను కారుతో తొక్కించి చంపేశారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలతో కలిసి నేను వివేకా ఇంటి కాంపౌండ్ లోకి దూకి లోపలికి వెళ్లాను. అప్పటికే ఇంట్లో ఉన్న గంగిరెడ్డి తలుపు తీయడంతో వెళ్లాను. మమ్మల్ని చూసి ఈ సమయంలో వీళ్లెందుకు వచ్చారని వివేకా నిర్ఘాంతపోయారు. తర్వాత బెడ్ రూమ్ లోకి వెళ్లారు. ఆయన వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడు. వివేకా బెడ్ రూమ్ లో డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగింది. వివేకాను బూతులు తిడుతూ ముఖంపై సునీల్ యాదవ్ దాడి చేశాడు. నా చేతిలోని గొడ్డలితో సునీల్ యాదవ్ వివేకాపై దాడి చేశాడు. వెంటనే వివేకా కింద పడిపోవడంతో ఆయన ఛాతీపై 7, 8 సార్లు సునీల్ యాదవ్ బలంగా కొట్టాడు. వివేకాపై గొడ్డలితో దాడి చేసి ఆయన చేత్తో లేఖ రాయించాం. సునీల్ యాదవ్, ఉమాశంకర్ ఇంట్లోని కొన్ని పత్రాలు తీసుకున్నారు. వివేకాను హత్య చేశాక అందరం గోడ దూకి పారిపోయాం. భయపడేది లేదు అవినాష్, శంకర్‌ రెడ్డి అంతా చూసుకుంటారని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడు.