ఏపీలో ఐఐఎఫ్‌టీ, ఐఐపీలను ఏర్పాటు చేయండి

ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ (ఐఐపీ)లను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విజ్ఞప్తి చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆమెతో సమావేశమైన మంత్రి బుగ్గన పోలవరంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. భావితరాలకు మంచి చదువులు, ఉపాధి కల్పన, సాంకేతిక అభివృద్ధికి కళాశాలలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆ రెండు విద్యా సంస్థల ఏర్పాటుపై కేంద్ర మంత్రితో చర్చించానన్నారు. విద్యా సంస్థల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఆన్‌రాక్‌ అల్యూమినియం కంపెనీ వివాదానికి సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న ఆర్బిట్రేషన్‌ కేసుపైనా ఆమెతో చర్చించానన్నారు. ఆ సంస్థకు అవసరమైన బాక్సైట్‌ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. న్యాయపరంగా కేసు పరిష్కారమైతే ఓ పెద్ద సంస్థ రాష్ట్రానికి వస్తుందన్నారు. పోలవరం నిధుల విడుదల పురోగతిలో ఉందని వివరించారు.