కేసీఆర్, హరీశ్‌రావులకు ఈటల సవాల్

బీజేపీ నేత ఈటల రాజేందర్ తొలిసారి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులను లక్ష్యంగా చేసుకున్నారు. హుజూరాబాద్‌ మండలం చెల్పూరు పంచాయతీలోని ముదిరాజ్‌లు నిన్న ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు దమ్ముంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనపై నేరుగా పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. తనను బక్కపల్చని పిల్లగాడు, దిక్కులేని పిల్లగాడు అని అంటున్నారని, కానీ హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నానని అన్నారు.

ఓటుకు రూ. 10 వేలు ఇచ్చినా సరే ప్రజల గుండెల్లోంచి తనను తుడిచేయలేరని స్పష్టం చేశారు. ఉరుములు వచ్చినా, పిడుగులు పడినా తన గెలుపును ఎవరూ ఆపలేరని ఈటల ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని, అయినా ఫర్వాలేదని, ఎన్నికల్లో చూసుకుందామని అన్నారు. ముఖ్యమంత్రి మాటల్లో, చేతల్లో నిజాయతీ లేదన్న ఈటల.. న్యాయబద్ధంగా పోటీ చేస్తే వారికి డిపాజిట్ కూడా దక్కదన్నారు. తాను మచ్చలేని వ్యక్తినని, కక్ష గట్టి తనను తప్పించారని ఆరోపించారు.