నిత్య స్మరణీయులు శ్రీ దామోదరం సంజీవయ్య గారు: పవన్ కళ్యాణ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి అణగారిన నేతగా అభివర్ణించారు. సమకాలీన కుటిల నీతి కారణంగా రెండేళ్లకే దామోదరం సంజీవయ్య తన పదవిని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రెండేళ్ల కాలంలో ఆయన సాధించిన విజయాలు, ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమైనవని అన్నారు.

తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి బీజం వేశారని పవన్ కల్యాణ్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, రాయలసీమలో గాజులదిన్నె, వరదరాజుల ప్రాజెక్టులు ఆ అపర భగీరథుని సంకల్పంతోనే రూపుదిద్దుకున్నాయని అన్నారు. కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది కూడీ దామోదరం సంజీవయ్యేనని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిజాం నుంచి ప్రభుత్వపరమైన భూముల్లో ఆరు లక్షల ఎకరాలను దళితులు, వెనుకబడిన వర్గాలకు పంపిణీ చేసి, భూబాంధవుడిగా నిలిచారని చెప్పారు. భవిష్యత్ అవసరాలను గుర్తించి, దానికి అనుగుణంగా చర్యలను తీసుకోవడంలో దామోదరం సంజీవయ్యకు సాటి లేరని అన్నారు. కార్మికులకు బోనస్, చట్టాల సవరణ కోసం న్యాయ కమిషన్, అవినీతి నిరోధక శాఖ, చర్మకార్మికుల కోసం లిడ్‌క్యాప్, ఊరూరా పారిశ్రామికవాడలు, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలను నెలకొల్పారని కొనియాడారు.

భాగ్యనగరం భవిష్యత్తు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాలను కలిపి మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. వృద్ధులు, వికలాంగుల కోసం పింఛన్ల పథకాన్ని ప్రారంభించింది కూడా దామోదరం సంజీవయ్యేనని అన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా ఉపన్యసించే వారని పవన్ కల్యాణ్ చెప్పారు. మాతృభాష తెలుగును పరిరక్షించడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర, ప్రత్యుత్తరాలను తెలుగులోనే నిర్వహించేలా ఆదేశాలను జారీ చేశారని, వాటిని పకడ్బందీగా అమలు చేశారని అన్నారు.

సామాజికంగా వెనుకబడిన బోయలు, కాపులు, తెలగ, బలిజ ఇతర అనుబంధ కాపు కులాలను బీసీల జాబితాలో చేర్చారని, వారి అభ్యున్నతి కోసం కృషి చేశారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇవన్నీ రెండేళ్ల కాలంలోనే చేసి చూపించారని చెప్పారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి దామోదరం సంజీవయ్య అధ్యక్షుడిగా పని చేశారని, తన రాజనీతిని చాటుకున్నారని అన్నారు. దామోదరం సంజీవయ్య అతి సాధారణ జీవితం గడిపారని, కన్నుమూసే నాటికి ఆయనకు ఉన్న ఆస్తులు 17 వేల రూపాయల నగదు, ఓ పాత ఫియట్ కారు మాత్రమేనని చెప్పారు. అందుకే ఆయన చిరస్మరణీయుడయ్యారని పవన్ కళ్యాణ్ అన్నారు.

దామోదరం సంజీవయ్య చేసిన సేవలకు గుర్తుగా ఆయన నివాసం ఉన్న ఇంటిని స్మారకచిహ్నంగా మలచాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. దీనికోసం కోటి రూపాయలతో ప్రత్యేకంగా ఓ నిధిని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన నివాసాన్ని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దడానికి ఈ నిధిని వినియోగిస్తామని అన్నారు. ఆ మహనీయుడిని పాలకులు విస్మరించారని ధ్వజమెత్తారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.