ఆర్ణబ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు

నకిలీ టిఆర్‌పి కుంభకోణంలో రిపబ్లిక్ టీవీ చానల్ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామి పాత్రపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ముంబయి పోలీసులు ఇవాళ బాంబే హైకోర్టుకు తెలిపారు. బార్క్ (బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) తో కలిసి తాము సాగించిన దర్యాప్తులో రిపబ్లిక్ టీవీ, ఆర్నాబ్ గోస్వామికి వ్యతిరేకంగా ఆధారాలను గుర్తించామని పోలీసుల తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టుకు వివరించారు.

మూడు చానళ్లు టీఆర్పీ రేటింగ్ ను తారుమారు చేస్తున్నట్టు గతేడాది ముంబయి పోలీసులు గుర్తించారు. అందులో రిపబ్లిక్ టీవీ చానల్ కూడా ఉంది. టీఆర్పీ రేటింగ్ ను ఎక్కువ చేసి చూపేందుకు గాను ఆర్నాబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈవో పార్థో దాస్ గుప్తాకు లక్షల రూపాయలు ముడుపులు ముట్టచెప్పినట్టు పోలీసులు  ఆరోపిస్తున్నారు.

కాగా, ఇవాళ విచారణ సందర్భంగా బాంబే హైకోర్టులో వాదనలు చోటుచేసుకోలేదు. రిపబ్లిక్ టీవీ చానల్ తరఫున వాదిస్తున్న రెండో సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాకపోవడంతో పూర్తిస్థాయి విచారణ లేకుండానే వాయిదా పడింది. హరీశ్ సాల్వే కుటుంబంలో ఒకరికి అస్వస్థత కలగడంతో ఆయన న్యాయస్థానానికి రాలేకపోయారు.

ఈ మేరకు రిపబ్లిక్ టీవీ న్యాయవాదుల బృందంలో ఒకరు కోర్టుకు విన్నవించారు. దాంతో, ముంబయి పోలీసుల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ తదుపరి విచారణ వరకు నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోరని హామీ ఇచ్చారు. అనంతరం విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది