అంబానీ నివాస సమీపంలో పేలుడు పదార్థాల కలకలం…

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో… ఎవరో వదిలేసి వెళ్లిన కారు.. కలకలం సృష్టించింది. అత్యంత భద్రత నడుమ ఉండే.. అంబానీ నివాసానికి సమీపంలో చాలా సేపటి నుంచి నిలిచి ఉన్న ఒక స్పార్పియో వాహనాన్ని గుర్తించారు సిబ్బంది. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్‌ టీమ్స్‌ అక్కడికి చేరుకొని తనిఖీ చేశాయి. ఆ వాహనాన్ని అక్కడ ఎవరు పార్క్‌ చేశారు? ఎందుకు వదిలేసి వెళ్లారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంబానీ ఇంటి దగ్గర స్వాధీనం చేసుకున్న కారులో జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు. దీనిపై ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. దర్యాప్తులో పూర్తి వాస్తవాలు తెలుస్తాయని తెలిపారు. ఈ ఘటనతో అలర్టైన పోలీసులు.. ముకేశ్‌ నివాసానికి వెళ్లే అన్ని మార్గాల్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ నిలిచి ఉన్న వాహనం నంబరు ప్లేటు.. నకిలీదని తేలింది. ట్రాఫిక్‌ పోలీసులు కారును సీజ్‌ చేశారు.