నకిలీ చలానాల కుంభకోణం.. సమగ్ర దర్యాప్తుకు జగన్ ఆదేశం

నకిలీ చలానాల కుంభకోణం ఏపీలో కలకలం రేపుతోంది. దీనిపై స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆడిట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో సబ్ రిజిస్ట్రార్ తో పాటు జూనియర్ అసిస్టెంట్ పై అధికారులు వేటు వేశారు. ఇటీవలే  కడపలో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు పడింది.

మరోవైపు ఈ అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఆయన చర్చించారు. సొమ్ము రికవరీపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సమాధానంగా ఇప్పటికే రూ. 40 లక్షలు రికవరీ చేసినట్టు సీఎంకు అధికారులు వివరించారు. రిజిస్ట్రేషన్ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ కుంభకోణంపై పూర్తి  స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.