పేరుకే రైతు భరోసా కేంద్రాలు – పెత్తనమంతా మిల్లర్లదే

*ధాన్యం కొనుగోళ్లలో మాయాజాలం
* 75 కేజీల బస్తాకు రూ.200 దోపిడీ
* లబోదిబోమంటున్న అన్నదాత
* అధికారుల పాత్రా అనుమానాస్పదం
* పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం

ధాన్యం రైతు మరోసారి దగా పడ్డాడు. రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధరలు ప్రకటిస్తుంది. మార్కెట్లో కేంద్రం ప్రకటించిన ధరల కన్నా తక్కువ ధర ఉంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఒకవేళ మార్కెట్లో అధిక ధరలుంటే రైతులు తమ పంట ఎవరికైనా అమ్ముకోవచ్చు. అయితే ధాన్యం విషయంలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర అమలు కావడం లేదు. ధాన్యం కొనుగోలులో అధికారుల అండతో మిల్లర్లు రైతును దగా చేస్తున్నారు. మద్దతు ధరలో భారీగా కోత వేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. కనీస మద్దతు ధర దక్కేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో మిల్లర్ల మోసానికి అంతే లేకుండా పోయింది.
* మద్దతు ధర మాటే లేదు
కేంద్రం తాజాగా కనీస మద్దతు ధరలు ప్రకటించింది. దీని ప్రకారం సాధారణ వరి రకాలకు క్వింటాకు రూ.1940, గ్రేడ్ ఎ రకాలకు రూ.1960 చెల్లించాలి. కానీ ఏపీలో ఎక్కడా మద్దతు ధర అమలు కావడం లేదు. తేమ శాతం, నూక, వ్యర్థాల పేరుతో ధాన్యం మద్దతు ధరలో భారీ కోతలు వేస్తున్నారు. 75 కేజీల బస్తాకు రూ.200 ధర తగ్గిస్తున్నారు. మద్దతు ధర ప్రకారం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి, వారికి 75 కేజీలకు రూ.1455 చెల్లించాలి. కానీ తేమ, నూక, వ్యర్ధాల పేరుతో కోతలు వేసి బస్తాకు రూ.1200 నుంచి రూ.1250 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతుకు బస్తాకు రూ.200 నుంచి రూ.250 వరకు నష్టం వాటిల్లుతోంది. ఇలా ఒక్కో రైతు వేలల్లో నష్టపోవాల్సి వస్తోంది. కనీస మద్దతు ధర దక్కేలా చూడాల్సిన ప్రభుత్వ అధికారులే మిల్లర్లతో చేతులు కలపడంతో ఇక వారి దోపిడీ మరింత పెరిగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి.
* మిల్లర్ల ఇష్టారాజ్యం
మిల్లర్ల దోపిడీకి అంతే లేకుండా పోయింది. తేమ పేరుతో తూకాల్లో కోతలు వేస్తున్నారు. 75 కేజీల ధాన్యం తీసుకుని 61.85 కేజీలు తీసుకున్నట్టు నమోదు చేస్తున్నారు. ధాన్యంలో 17 శాతం తేమ అనుమతించాలని కేంద్రం ఆదేశించినా మిల్లర్లు 16 శాతం మాత్రమేనని రైతులను మోసం చేస్తున్నారు. రైతులు మిల్లుకు తెచ్చిన ధాన్యం పరిశీలించి తేమ అధికంగా ఉందని, నూక ఎక్కువగా ఉందని బస్తాకు రూ.200 కోత వేస్తున్నారు. దీంతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. కొన్ని చోట్ల హమాలీ, రవాణా ఖర్చులు కూడా రైతుల వద్ద నుంచే వసూలు చేస్తున్నారు. రవాణాకు బస్తాకు రూ.80, హమాలీలకు బస్తాకు రూ.20 ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ విషయం దాచి పెట్టి రైతుల వద్దే వసూలు చేస్తున్నారు. ఈ ఖర్చులు నేరుగా మిల్లర్ల ఖాతాలో ప్రభుత్వం వేస్తోంది. రవాణా, హమాలీ ఖర్చులు కూడా రైతుల వద్ద నుంచి వసూలు చేసి, ఒక్కో రైతు నుంచి బస్తాకు మరో రూ.100 వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు.
* ఇలా జరగాలి
రైతులు వరి పంట సాగు ప్రారంభించిన తరవాత ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి. వరి కోతలు పూర్తయ్యాక ఆర్బీకేలకు వెళ్లి సమాచారం ఇవ్వాలి. రైతు భరోసా కేంద్రం సిబ్బంది కళ్లం వద్దకే వెళ్లి ధాన్యం నాణ్యత పరిశీలించాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. కళ్లం వద్దే ధాన్యం నాణ్యత పరిశీలించి, సేకరించే వివరాలతో కూపన్ అందించాలి. కూపన్ తో పాటు తరలించేందుకు ఖాళీ గోతాలు ఇవ్వాల్సి ఉంది. ఇలా ధాన్యం గోతాల్లో నింపాక ఆర్బీకే సిబ్బంది మిల్లుకు తరలించాలి. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రైతు భరోసా కేంద్రాల ద్వారా జరగాలి. కానీ వాస్తవంలో దీనికి పూర్తి భిన్నంగా జరుగుతోంది.
* క్షేత్ర స్థాయిలో ఇలా జరుగుతోంది
రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది నమోదు చేసిన ధాన్యం నాణ్యత పరీక్షలను మిల్లర్లు అంగీకరించడం లేదు. అందుకే నేరుగా మిల్లర్ల వద్దకు వెళ్లాలని ఆర్బీకే సిబ్బంది చెబుతున్నారు. మిల్లర్లు తరుగు, తేమ, నూక పేరుతో ధరలో భారీగా కోతలు వేస్తున్నారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేశాక ఇచ్చే స్లిప్ ఆధారంగానే రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే 75 కేజీల సాధారణ రకాలను రూ.1455కు కొనాల్సి ఉండగా మిల్లర్లు కేవలం రూ.1200 కే కొంటున్నారు. రైతుల వద్ద 75 కేజీల ధాన్యం తీసుకుని 61.85 కేజీలుగా నమోదు చేస్తున్నారు. దీంతో ఒక్కో రైతు బస్తాకు రూ.200 నుంచి రూ.250 వరకు నష్టపోతున్నాడు.
* అధికారుల అండతోనే….
దోపిడీని అడ్డుకోవాల్సిన అధికారులు నోరుమెదపడం లేదు. దీంతో మిల్లర్ల పని మరింత సులువైంది. రైతుల వద్ద నుంచి మిల్లర్లకు అదనంగా వచ్చిన ధాన్యాన్ని, వారికి నమ్మకమైన రైతుల పేరుతో ఆన్ లైన్లో నమోదు చేస్తున్నారు. ఆ రైతు ఖాతాలో నగదు పడగానే మిల్లర్లు తీసుకుంటున్నారు. ఇలా రైతులకు దక్కాల్సిన మద్దతు ధరలో కోతలు వేసి అధికారులు, మిల్లర్లు దోచుకుతింటున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ధాన్యం సేకరణకు ప్రభుత్వం ఉచితంగా గోతాలు అందించాలి. ఎందుకంటే ఆ గోతం మరలా ప్రభుత్వానికే చేరుతుంది. కానీ వాస్తవంగా ప్రభుత్వం ఒక్క గోతం కూడా ఇవ్వడం లేదు. మిల్లర్ల వద్ద గోతాలు తెచ్చుకోవాలని ఆర్బీకే సిబ్బంది రైతులకు చెబుతున్నారు. మిల్లర్ల వద్దకు గోతాలకు వెళితే వారు చిరిగిపోయినవి ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ధాన్యం రవాణా చేసేప్పుడు కూడా నష్టపోవాల్సి వస్తోంది.
* డబ్బు ఎప్పుడొస్తుందో తెలియదు
ధాన్యం కొనుగోలు చేసిన మూడు వారాల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఎక్కడా అమలు కావడం లేదు. ధాన్యం కొనుగోలు చేశాక రెండు నుంచి మూడు నెలల సమయం తీసుకుంటున్నారు. ప్రతి దశలోనూ అలసత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ధాన్యం మిల్లుకు చేరగానే మిల్లర్లు రైతుకు స్లిప్ ఇవ్వాలి. దాన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఆన్ లైన్ చేస్తారు. అయితే మిల్లుకు ధాన్యం చేరిన 20 రోజుల తరవాత స్లిప్ ఇస్తున్నారు. ఆ తరవాతే ఆన్ లైన్ చేయడానికి వీలవుతోంది. ఆన్ లైన్ చేసిన తరవాత ఇక రైతుల ఖాతాల్లో నగదు ఎప్పుడు జమ చేస్తారో అంచనా వేయడం కూడా కష్టం. నగదు రావడానికి రెండు మూడు నెలలు పడుతోందని రైతులు చెబుతున్నారు.
* ఈ క్రాప్ అస్తవ్యస్తం
రైతులు తాము సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేసుకోవడమే ఈ క్రాప్. ఈ క్రాప్ లో నమోదు చేసిన పంట విస్తీర్ణం, గ్రామాల్లో సాగు చేసిన విస్తీర్ణాలకు భారీ వ్యత్యాసం వస్తోంది. ఈ క్రాప్ చేయని సర్వే నంబర్లతో, ఆధార్ లింకు చేసి పౌరసరఫరాల శాఖ అధికారుల అండదండలతో మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు. గతంలో పంట సాగు చేసిన రైతుల వివరాలన్నీ వెబ్ సైట్లో కనిపించేవి. తాజాగా వాటిని తొలగించారు. కేవలం లారీలో ధాన్యం తెచ్చిన వివరాలు మాత్రమే నమోదు చేస్తున్నారు. దీంతో ఏ రైతు ఎంత పంట అమ్మారనే విషయాలు ఎవరికీ తెలియకుండా చేశారు. ఇక్కడే ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తెరతీశారనే విమర్శలు వస్తున్నాయి. అధికారులకు లంచాలు ఎరవేసి, మిల్లర్లు రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, మరలా రైతుల పేరుతోనే మద్దతు ధరలకు సరకు అమ్మినట్టు నమోదు చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం మొత్తానికి ఇ క్రాప్ లో లోపాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం ఉందని అధికార పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలే పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని పరిస్థితులను చక్కదిద్దాలి.