ప్రతి ఇంటికీ ఫైబర్‌నెట్‌ కనెక్షన్‌ – ఎపిఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ గౌతంరెడ్డి

ఎపి ఫైబర్‌నెట్‌ కనెక్షన్‌ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇవ్వడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఆ విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని ఎపిఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పి గౌతంరెడ్డి అన్నారు. విజయవాడలోని ఎన్టీర్‌ భవనంలోని తన కార్యాలయంలో గౌతంరెడ్డి విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎపి ఫైబర్‌నెట్‌ను రాష్ట్రంలోని ముఖ్యమైన ఆదాయ వనరుల్లో ఒకటిగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.100కోట్లు అవినీతి జరిగిందని, ఫలితంగా ఈ సంస్థ అప్పుల ఊబిలోకి వెళ్లిందని తెలిపారు. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించి రూ.300కోట్లతో ఆదాయం సమకూర్చడానికి ప్రణాళికను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీలో ఉన్న ఎపి ఫైబర్‌నెట్‌ ప్రధాన సంస్థను ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. 13జిల్లాల్లోని 670 మండలాలు, 11,274 గ్రామ పంచాయతీల్లో ఆప్టికల్‌ ఫైబర్‌నెట్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకుగాను రూ.1,071కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. 15ఎంబిపిఎస్‌ రూ.197, 40ఎంబిపిఎస్‌ రూ.262, 80ఎంబిపిఎస్‌ రూ.367లకే అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సంక్షేమాభివృద్ధి పాలనకు నేటితో రెండు సంవత్సరాలు పూర్తయ్యిందని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.