పోలవరపు వెంకటేశ్వర్లు కుటుంబానికి ఆర్ధిక సాయం చేసి ఆడ బిడ్డల చదువుల బాధ్యత తీసుకున్న జనసేనాని

సాగు భారమై, వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు పోలవరపు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదివారం పరామర్శించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం యనమదల గ్రామానికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఆయన భార్య శ్రీమతి పోలవరపు అనూషకు అందజేశారు. ఇద్దరు ఆడబిడ్డలు వైష్ణవి, శ్రీలక్ష్మీ చదువుల బాధ్యత పార్టీ చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వరుసగా పంట నష్టాలు రావడం, బోర్లు వేసినా నీళ్లు పడకపోవడం, సాగు కోసం చేసిన రూ.16 లక్షలు అప్పు తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కన్నీరు పెట్టుకున్న కుటుంబ సభ్యులను ఓదారుస్తూ… మనోధైర్యం నింపడానికే మేమంతా ఇక్కడికి వచ్చామని, మీ కుటుంబానికి మా వంతు అండగా నిలబడతామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.