పైసల్లేక.. పల్లె గొల్లుమంటోంది!

*కేంద్రం నిధులు వాడేసుకున్న జగన్ ప్రభుత్వం
*పంచాయతీల్లో పడకేసిన ప్రజారోగ్యం
*పారిశుధ్య నిర్వహణకూ సొమ్ముల లేమి
*జీతాలకూ కటకట

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలు నిధుల కొరతతో నానా ఇక్కట్లు పడుతున్నాయి. మూడేళ్ల క్రితం అధికారంలోకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వచ్చినప్పటి నుంచీ పంచాయతీల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. రాష్ట్రంలో 13,324 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కిందటేడాది వాటికి ఎన్నికలు జరిగాయి. సర్పంచులు, వార్డు సభ్యుల నాయకత్వంలో సజావుగా జరగాల్సిన గ్రామ పాలన సొమ్ముల్లేక పడకేసింది. అరకొర నిధులు గ్రామాల అభివృద్ధి మాట అటుంచి ఆరోగ్య సంక్షేమ పనులకే సరిపోవడం లేదు. కేంద్ర ఆర్థిక సంఘం దేశంలోని గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు అందించడానికి వివిధ మొత్తాలు మంజూరు చేస్తుంది. అయితే, గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ కావాల్సిన సొమ్మును వైస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తన ఇతర పనులకు మళ్లిస్తోంది. ఫలితంగా, తమ రోజూవారీ, నెలవారీ అవసరాలకు గ్రామ పంచాయతీలకు తగినన్ని నిధులు అందుబాటులో లేకుండా పోయాయి. చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి. నిత్యావసర, అత్యవసర పనులు సైతం ఆగిపోతున్నాయి.
*ఆర్థిక సంఘాల నిధుల మళ్లింపే అసలు సమస్య
ఖాతాల్లో సొమ్ములు లేక నలిగిపోతున్న గ్రామ పంచాయతీలు మళ్లీ గాడినపడి సాధారణ విధులు నిర్వర్తించాలంటే రాష్ట్ర సర్కారు తక్షణమే 14వ, 15వ కేంద్ర ఆర్థిక సంఘాలు మంజూరు చేసిన నిధులను ఏపీలోని గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలి. కింది స్థాయిలోని ఈ స్థానిక పంచాయతీ రాజ్‌ సంస్థలు అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చుకుని, వాటిని సజావుగా నిర్వహించాలంటే ఎప్పటి నుంచో పెండింగ్‌లో పెట్టుకున్న కేంద్ర నిధులను విడుదల చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులకు నిధుల సమకూర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘాలు రూ.1245 కోట్లు మంజూరు చేశాయి. ఈ మొత్తాన్ని విద్యుత్‌ బకాయిలు, ఇతర అవసరాలకు జగన్‌ ప్రభుత్వం మళ్లించింది. గ్రామ పంచాయతీలకు అందాల్సిన డబ్బును ఇలా రాష్ట్ర సర్కారు ఇతర పనులకు వాడుకోవడం రాజ్యాంగ 73వ, 74వ సవరణ చట్టాలకు విరుద్ధం. తమ చేతుల్లో కనీస స్థాయిలో డబ్బు లేకపోవడంతో గ్రామ పంచాయతీలు తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక అవసరాలు తీర్చలేకపోతున్నాయి. సిబ్బంది వేతనాలు చెల్లించడానికి కూడా సాధారణ నిధులు సరిపోవడం లేదు. కేంద్రం నుంచి వచ్చిన రూ.1245 కోట్లను జగన్‌ ప్రభుత్వం దారిమళ్లించాక మళ్లీ కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు పంపలేదు.
*పంచాయతీల వాటా సైతం విదిల్చని వైనం
కేంద్రం తనకు వచ్చే పన్ను వసూళ్ల నుంచి రాష్ట్రాలకు వాటా ఇచ్చినట్టే–గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ అంశాలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన వివిధ సేవలకు వసూలు చేసిన సుంకాల వాటాలు ఇవ్వాలి. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీలో గ్రామాల వాటా, మనిషికి రూ.4 చొప్పున రావాల్సిన తలసరి గ్రాంటు, ఇతర పన్నుల వాటాల కింద సొమ్ము ఇంకా ఏపీ పంచాయతీల ఖాతాల్లో జమకాలేదు. ఏడాదిన్నర నుంచి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా రాకపోవడంతో గ్రామ పంచాయతీల అకౌంట్లలో లక్షల్లో ఉండాల్సిన డబ్బు ఇప్పుడు వేలకు తరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు స్థానికంగా వసూలు చేసే పన్నుల మొత్తాలు సిబ్బంది జీతభత్యాలకు కూడా సరిపోవడం లేదు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు నిధుల లేమితో బాధపడుతున్న పంచాయతీలపై ఒత్తిడి పెంచేశాయి. ప్రజారోగ్యం ఎంతగా క్షీణించిందంటే ఇటీవల కృష్ణాజిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో సంభవించిన మరణాలను గమనిస్తే పరిస్థితి తీవ్రత అర్ధమౌతోంది. ప్రజారోగ్యంపై ఖర్చు చేయడానికి సొమ్ము లేకపోవడంతో వానాకాలం స్వచ్ఛమైన మంచినీరు సరఫరా కావడం లేదు. తెంపల్లిలో మంచినీటి సరఫరా పైపుల్లోకి మురుగు నీరు కలిసిపోయింది. విషతుల్యమైన నీరు తాగడంతో గ్రామంలో ముగ్గురు మరణించారు. వంద మందికి పైగా అనారోగ్యంతో ఆస్పత్రుల పాలయ్యారు. గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పూర్తిగా చెల్లించలేని పంచాయతీలు వారికి బకాయిపడ్డాయి. వర్షాకాలం వీధుల్లో చల్లించే బ్లీచింగ్‌ పౌడర్, సున్నం, శానిటేషన్‌ సామాగ్రి, మంచి నీటి స్వచ్ఛతకు అందులో కలిపే ద్రవాలు కొనుగోలు చేయడానికి చేతుల్లో డబ్బు లేక సర్పంచులు ప్రజారోగ్య కార్యక్రమాలను నామమాత్రంగా కూడా నడపలేకపోతున్నారు. కేంద్ర ఆర్థికసంఘం నిధులను గ్రామ పంచాయతీలు ప్రధానంగా మంచినీరు, పారిశుద్ధ సమస్యల పరిష్కారానికి ఉపయోగించేవి. ఈ నిధులు ఆగిపోవడంతో ఈ రెండు కీలక సేవలకు అంతరాయం ఏర్పడింది.
*గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే
నగరాలు, పట్టణాల్లో మాదిరిగానే పంచాయితీల్లో ఇళ్ల నుంచి చెత్త పోగుచేసే కార్యక్రమం సాధారణ స్థాయిలో జరిగేది. ప్రస్తుత నిధుల కొరత నేపథ్యంలో ఈ పని కూడా కుంటినడక నడుస్తోంది. ప్రతి ఇంటి నుంచి చెత్త పోగుచేయడానికి ప్రత్యేకంగా నియమించిన హరిత రాయబారులకు దాదాపు ఆరు నెలలుగా జీతాల బకాయిలు చాలా గ్రామాల్లో చెల్లించాల్సిన పరిస్థితి. కృష్ణా జిల్లా సహా ఐదారు జిల్లాలలోని అనేక గ్రామాల్లో తొమ్మిది నెలల నుంచి ఏడాది కాలానికి వేతనాలు బకాయిపడ్డారు. గ్రామాల్లో రోడ్లు, కాలవలు పరిశుభ్రంగా ఉండేలా చూసే సిబ్బందకి కూడా గ్రామ పంచాయతీలు ఇంకా జీతాల బకాయిలు ఆరు నెలలకు పైగా చెల్లించాల్సి ఉంది. వర్షాకాలం దోమల నివారణకు గ్రామాలకు సమకూర్చిన దాదాపు 14 వేలకు పైగా ఫాగింగ్‌ యంత్రాలు చాలా వరకూ వినియోగంలో లేవు. వాటిని ఉపయోగించడానికి, ఇంథనంతోపాటు వాటిలో వాడే పదార్ధాల కొనుగోలుకు తగిన సొమ్ము లేకపోవడంతో దోమల నివారణ కార్యక్రమం మూలనపడింది. వందలాది గ్రామాల్లో మంచి నీటి సరఫరా కోసం నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, నీటి పైప్‌లైన్ల నిర్వహణకు కూడా సొమ్ములు లేవు.
*నీటి పరీక్షలు చేయించినా దిద్దుబాటు చర్యలు లేవు
గ్రామ పంచాయతీలను బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అనే మహత్తర లక్ష్య సాధనకు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రజానీకం ఆరోగ్య పరిరక్షణ బాధ్యతలు ఎక్కువగా చూసేది గ్రామ పంచాయతీలే. మరి, రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు కల్పించిన రాజ్యాంగబద్ధత కేవలం వాటికి ఎన్నికలు జరిపించడానికే పనికొస్తోంది. గ్రామాల ప్రజల ఆరోగ్య అవసరాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాల్సిన నిధులు పంచాయతీల ఖాతాల్లో పడకుండా దాదాపు పూర్తిగా ఆగిపోవడంతో అధికార వికేంద్రీకరణ కోసం ఏర్పడిన పంచాయతీరాజ్‌ వ్యవస్థ నీరుగారిపోతోంది. వేసవి తర్వాత పల్లెల్లో ప్రజలను పీడించేవి నీటి కాలుష్యం వల్ల వచ్చే జబ్బులే. నీటిలో కలిసే ప్రమాదకర సూక్ష్మజీవులను ఎప్పటికప్పుడు పసికట్టి తగిన నివారణ చర్యలు తీసుకోవాల్సిన కీలక బాధ్యతను ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో పంచాయతీలు నిర్వహించలేకపోతున్నాయి. గ్రామీణులకు సరఫరా అయ్యే తాగునీరు స్వచ్ఛంగా ఉందో లేదో తెలుసుకోవడానికి సిబ్బంది ఏడాదికి రెండుసార్లు నీటి నమూనాలు సేకరిస్తారు. వాటిని పరీక్షించాక వచ్చే నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటారు. కాని, నీటి పరీక్షల ఫలితాలు వచ్చినా తక్షణ చర్యలకు గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది ప్రయత్నించడం లేదు. నిధుల కొరతతోపాటు మౌలిక సౌకర్యాలు పూర్తిగా లేని గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్‌లో అనేకం ఉన్నాయి. దేశంలో సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలు ఎక్కువ ఉన్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌ అని ఎనిమిదేళ్ల నాడే తేలింది. ఆ తర్వాత ఈ సమస్య పూర్తిగా పరిష్కరించకపోగా, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ప్రాణప్రదమైన నిధుల ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేయడం దారుణం, అమానుషం అని వేరే చెప్పాల్సిన పనిలేదు.