టీమిండియాకు మళ్లీ జరిమానా

ఆస్ట్రేలియాపై మూడు టీ20ల సిరీస్ 2-1తో గెలిచి ఆనందంలో ఉన్న భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. సిడ్నీ వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా టీమిండియా మ్యాచ్‌ ఫీజులో 20శాతం జరిమానా విధించారు. భారత జట్టు నిర్ధిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసిందని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తెలిపాడు. దీంతో భారత జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ రిఫరీ జరిమానా విధించాడు. ఐసీసీ నిబంధనలో భాగంగా ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. ఆసీస్‌ టూర్‌లో విరాట్‌ కోహ్లి సేనకు జరిమానా విధించడం ఇది రెండోసారి. ఇంతకముందు వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఫైన్‌ విధించిన సంగతి తెలిసిందే.