ఫిట్‌ ఇండియాను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి.. మోదీ

భారత్‌లో ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ప్రారంభించి ఏడాది గడిచిన నేపథ్యంలో ప్రముఖ క్రీడాకారులను ఆన్‌లైన్ ద్వారా ప్రధాని పలకరించారు.

ఉద్యమంలా ఫిట్‌ ఇండియాను ప్రజల్లోకి తీసుకుపోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మనం ఫిట్‌గా ఉంటేనే మన దేశం ఫిట్‌గా ఉంటుందని, అందుకే ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండేందుకు యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దుబాయ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీతో మోదీ మాట్లాడారు. అలాగే పలువురు క్రీడాకారులు, సినిమా నటులు, వ్యాయామ నిపుణులతో మోదీ మాట్లాడారు. వారి నుంచి పలు సూచనలు తీసుకోవడమే కాకుండా వారికి కూడా పలు సలహాలు ఇచ్చారు.

ఫిట్‌నెస్‌ ఉండాలంటే ఆటలు బాగా ఆడాలని అది ఒకరు చెబితే రాదని మననుంచి రావాలని చెప్పాడు విరాట్ కోహ్లీ. ముందుగా ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని విరాట్ కోహ్లీ ప్రధానికి చెప్పారు. ఫిట్‌నెస్‌లో డైట్ అనేది కీలక పాత్ర పోషిస్తుందని విరాట్ కోహ్లీ చెప్పాడు.

మారుతున్న కాలంలో ఫిట్‌నెస్ అనేది మరుగున పడుతోందని… ఇది మరిచామంటే అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రధాని మోడీతో చెప్పాడు విరాట్ కోహ్లీ. ఇక భోజనం సమయాలను కరెక్టుగా పాటించాలని విరాట్ కోహ్లీ చెప్పాడు.

వెయిట్ లాస్ కోసం చాలామంది ఆహారానికి దూరమవుతున్నారని తద్వారా అనారోగ్యసమస్యలను కొని తెచ్చుకుంటారని చెప్పాడు. మారుతున్న కాలనికి అనుగుణంగా క్రీడా సంస్కృతి కూడా మారుతూ వస్తోందని చెప్పిన విరాట్… ఒకప్పుడు నైపుణ్యం బాగుండేదని కాని ఫిట్‌నెస్ ఉండేదని ఆ స్థాయిలో ఉండేది కాదని చెప్పాడు. అయితే తన జట్టు మొత్తం ఇప్పుడు ఫిట్‌నెస్‌పైనే దృష్టి సారించిందని విరాట్ చెప్పాడు..

ఇక ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణులు, క్రీడాకారులతో మాట్లాడారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రధాని మోడీ మాట్లాడారు. విరాట్ కోహ్లీతో పాటు నటుడు, మోడల్ అయిన మిలింద్ సోమన్‌తో కూడా మాట్లాడారు. అదే సమయంలో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్‌తో ఆహారపు అలవాట్లు,ఆరోగ్యకరమైన జీవితానికి కావాల్సిన డైట్ గురించి అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోడీ.

భారత్‌ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలన్న మంచి ఉద్దేశంతో ప్రధాని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ ప్రజలంతా ఫిట్‌నెస్ పాటించాలని కోరుతూ ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌లో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.