ఎన్నికలపై ఫోకస్.. ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమావేశం..

త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ బై ఎలక్షన్‌తోపాటు, పట్టభద్రుల ఎన్నికలపై అధికార టీఆర్‌ఎస్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాలతో టీఆర్‌ఎస్‌ నాయకత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎన్నికలపై ఇంఛార్జి నేతలకు స్పష్టమైన సూచనలు చేశారు సీఎం కేసీఆర్‌.

విపక్షాలతో పాటు ఇండిపెండెంట్లు సైతం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవడంతో అధికార పార్టీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించారు సీఎం కేసీఆర్‌. హైదరాబాద్‌ జిల్లాకు గంగుల కమలాకర్‌, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జీగా హరీష్‌రావు, మహబూబ్‌నగర్‌ ఇంఛార్జీగా ప్రశాంత్‌రెడ్డిలను నియమించారు. ఇటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను సైతం పలువురు మంత్రులకు అప్పగించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికతో పాటు ఇతర రాజకీయ అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.