ప్రజాసేవ కోసం.. సినిమాలకు గుడ్ బై చెప్తా: కమల్‌ హాసన్‌

చెన్నై: ప్రజాసేవ కోసం సినిమాలను వదిలేస్తానని నటుడు, మక్కల్ నీతి మైయం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 6న జరుగనున్న నేపథ్యంలో ఆదివారం పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. తన రాజకీయ జీవితానికి సినిమాలు అడ్డంకిగా మారితే అన్ని షూటింగ్‌లను పూర్తి చేసిన తర్వాత ఆ రంగాన్ని వీడుతానని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని కమల్‌ తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్న 30 శాతం మందిలో తాను కూడా ఒకడినని, అందుకే రాజకీయాల్లోకి రావాలన్న తన నిర్ణయం చారిత్రకమని అన్నారు.

‘ఎన్నికల తర్వాత నేను రాజకీయాల్లో కనిపించనని, సినిమాలకు తిరిగి వెళ్తానని చాలా మంది అభ్యర్థులు అంటున్నారు. రాజకీయాల్లో కనిపించనా లేక సినిమాల్లో కనిపించనా అన్నది తర్వలో తెలుస్తుంది. ప్రజలే దీన్ని నిర్ణయిస్తారు’ అని కమల్‌ వ్యాఖ్యానించారు. తనకు పలు వర్గాల నుంచి బెదిరింపులు వచ్చాయన్న ఆయన ఆ వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. నిజాయతీ పార్టీ కావడంతో వాస్తవ ప్రచార ఖర్చుల వివరాలను ఎన్నికల అధికారుల ముందు ఉంచానని, వారు కూడా తనను అభినందించారని వెల్లడించారు.