రైతుల హింస దురదృష్టకరం: రాష్ట్రపతి

రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో జరిగిన హింస పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. ట్రాక్టర్ ర్యాలీ వేళ హింస చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రైతు ఉత్పత్తులపై కనీస మద్దతు ధరను తమ ప్రభుత్వం పెంచినట్లు రాష్ట్రపతి వెల్లడించారు. జనవరి 26వ తేదీన జరిగిన ఘటన ఆవేదనకు గురి చేసిందన్నారు. జాతీయ జెండాను, అతి పవిత్రమైన గణతంత్ర దినోత్సవాన్ని అవమానించినట్లు ఆయన చెప్పారు. భావస్వేచ్ఛను కల్పించే రాజ్యాంగమే.. చట్టాలు, ఆంక్షలను పాటించాలని కూడా సూచించినట్లు రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. 25 కోట్ల ముద్ర రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. దేశ రైతాంగాన్ని బలోపేతం చేసేందుకు ఆత్మనిర్భర్ భారత్ ఫోకస్ చేసినట్లు చెప్పారు. కొత్త సాగు చట్టాలతో సుమారు 10 కోట్ల మంది రైతులకు లాభపడనున్నట్లు తెలిపారు.

కొత్త సాగు చట్టాలు రూపకల్పన చేయకముందు ఉన్న హక్కులు, సదుపాయాలను తగ్గించలేదని రాష్ట్రపతి స్పష్టం చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన సాగు సంస్కరణలు.. రైతులకు కొత్త అవకాశాలను, హక్కులను కల్పించినట్లు రామ్‌నాథ్ చెప్పారు. చిన్న, మధ్యతరహా రైతుల శ్రేయస్సు కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, రైతులకు తమ అకౌంట్లలోకి నేరుగా నగదు బదిలీ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద సుమారు 1,13000 కోట్లు బదిలీ చేసినట్లు ఆయన వెల్లడించారు.