ఫార్మా రంగంలో ముందడుగు

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్‌ మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం సందర్భంగా ఫార్మా రంగంలో హైదరాబాద్‌ తన బలాన్ని మరోసారి చాటుకుంటున్నదని అన్నారు. ప్రపంచంలో తయారయ్యే మొత్తం వ్యాక్సిన్లలో సుమారు 30 శాతానికి పైగా హైదరాబాద్‌ నగరం నుంచే ఉత్పత్తి కావడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత్‌ బయోటెక్‌ వంటి కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీలో ముందు వరుసలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఫార్మా, లైఫ్‌ సైన్స్‌ రంగాలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ రెండు రంగాల్లో హైదరాబాద్‌ ప్రాధాన్యం, భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. జీనోమ్‌ వ్యాలీ, దేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల పార్క్‌, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ హైదరాబాద్‌ ఫార్మాసిటీ వంటి ప్రాజెక్టులతోహైదరాబాద్‌ నగరం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారనుందని చెప్పారు. భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం సిద్థం చేసుకుంటున్నదని తెలిపారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రస్తావించారు.