రోడ్డు ప్రమాదంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం

కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్, స్కార్పియో, మరో కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కడప – తాడిపత్రి రహదారిపై గోటూరు – తోళ్ల గంగన్న పల్లె మధ్యలో ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ టిప్పర్‌, రెండు కార్లు కాలిపోయాయి, నలుగురు సజీవదహనమయ్యారు.. మృతి చెందిన నలుగురు తమిళనాడుకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

తమిళనాడు నుంచి అక్రమంగా ఎర్రచందనం వేసుకొని వస్తున్న స్కార్పియో విమానాశ్రయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీ కొట్టింది. నేరుగా డీజిల్‌ ట్యాంకును ఢీ కొనడంతో అది పేలిపోయి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. స్కార్పియోలోని నలుగురూ బయటకు రాలేక అక్కడిక్కడే సజీవదహనమయ్యారు. అదే సమయంలో మరో కారు వచ్చి ఢీ కొనడంతో అందులో ఉన్న మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తు్న్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఘటన స్థలాన్ని స్థానిక సిఐ పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.