మాజీ మంత్రి మాణిక్యాలరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పైడికొండ ల మాణిక్యాలరావు(60) శనివారం కన్నుమూశారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వారంరోజులుగా కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి వచ్చిన వైద్యులు కూడా సేవలందించారు. ఆ వ్యాధి నుంచి కోలుకుంటుండగానే, కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తాయి. శనివారం చికిత్స అందిస్తుండగానే రక్తపోటు అధికమై హృద్రోగ సమస్యలు రావడంతో ఆస్పత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.

ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో తాడేపల్లిగూడెంలోని మానవతా శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. మాణిక్యాలరావు అంత్యక్రియలకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు. మాణిక్యాలరావు కరోనా వైరస్ కారణంగా మరణించిన నేపథ్యంలో కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. డీఎస్పీ కె.రాజేశ్వర రెడ్డి, ఆర్డీవో రచన, మున్సిపల్ కమిషనర్ బాల స్వామి, పోలీస్ అధికారులు సమక్షంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

అయితే ప్రజలందరి ఆదరాభిమానాలతో పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని చివరిసారిగా ట్వీట్ చేసిన మాణిక్యాలరావు కన్నుమూయడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాణిక్యాలరావు.. అకాల మరణంతో ఆయన అభిమానులు పలువురు నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మాణిక్యాలరావు మరణంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మాజీ మంత్రికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేయగా అధికార లాంఛనాలతో మాజీ మంత్రి మాణిక్యాలరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి.