ఇరిగేషన్ డి.ఈకి వినతిపత్రం ఇచ్చిన గల్లా తిమోతి

కృష్ణాజిల్లా, మచిలీపట్నం, పెదయాదర గ్రామ సర్పంచ్ గల్లా తిమోతి మరియు ఇతర గ్రామస్తులతో కలిసి ఇరిగేషన్ డి.ఈకి వంతెన గురించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీలో ఎస్టీ కాలనీ నందు కాలువ వెంబడి వంతెన నిర్మాణం చేపట్టకపోవడం వలన ఈ కాలనీలో నివసించే 25 పైచిలుకు యానాది కుటుంబాలు వారి నిత్య జీవనోపాధి కోసం కృష్ణా నది వెంబడి వేటకు వెళ్లడానికి సదుపాయం లేక అలాగే ఈ కాలనీలో మరో 35 కుటుంబాలు ఇతర కులస్తులు వెరసి 60 కుటుంబాలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు వారికి కాలువ అవతలి వైపునున్న స్మశాన వాటిక చేరుకోవడం ఇబ్బందికరంగా ఉందని, ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే వారి పార్థివ దేహాన్ని తీసుకువెళ్లడానికి దాదాపు మూడు కిలోమీటర్ల నడిచి వెళ్ళవలసి వస్తుందని గతంలో ఈ విషయమై మేము స్పందన అర్జీ ద్వారా కలెక్టర్ కి కూడా విన్నవించామని ఈ వేసవికాలం సమయం కాలువలు ఎండగట్టే సమయం కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టాలని అందుకు గౌరవ ఇరిగేషన్ డి.ఈ చొరవ తీసుకోవాలని మచిలీపట్నం జనసేన పార్టీ మండల అధ్యక్షులు మరియు పెద యాదర గ్రామ సర్పంచ్ గల్లా తిమోతి వ్యాఖ్యానించారు. సత్వరమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని గౌరవ డిఈని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బావిశెట్టి వాసు పవన్ కుమార్, గ్రామ వార్డు మెంబర్ కంచర్లపల్లి నాగ సీతయ్య, గ్రామస్తులు అడుసుమిల్లి శ్రీనివాసరావు, కొత్తపల్లి శ్రీకాంత్ మరియు ముళ్ళపూడి కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.