గాంధీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. కోవిడ్ వార్డులను స్వయంగా పరిశీలించారు. సీఎం హోదాలో మొదటిసారి గాంధీ ఆస్పత్రికి వచ్చారు. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి హరీష్ రావు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. చికిత్స, వసతులపై ముఖ్యమంత్రి ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడారు. అలాగే పేషెంట్లతో కూడా కేసీఆర్ మాట్లాడారు. ఆస్పత్రిలో మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో సుమారు 18 వందలకుపైగా బెడ్లు ఉన్నాయి.

కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను సీఎం కేసీఆర్ పరామర్శించి, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను ముఖ్యమంత్రి అభినందించారు. కొవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్‌, ఔషధాల లభ్యతను పరిశీలించి అధికారులతో చర్చించనున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోగుల సహాయకులను బయటకు పంపించేశారు. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో రసాయనాలతో పిచికారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *