గోదావరి ఉద్ధృతి.. పూర్తిగా నీట మునిగిన గండిపోచమ్మ ఆలయం

భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం పెరగడంతో పోచమ్మగండి వద్ద గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగిపోయింది. వరద నీరు ఆలయ గోపురాన్ని తాకింది. మరోవైపు వరద కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని 30 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వరద పెరగడంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు సహాయ కార్యక్రమాలను చేపట్టారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలను తీసుకుంటున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద గోదావరి నీటిమట్టం 30 మీటర్లకు చేరుకుంది.