రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న టికెట్‌ ధరలు

ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ.. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన రైళ్లు.. మళ్లీ పెట్టాలు ఎక్కడానికి చాలా సమయం పట్టింది.. క్రమంగా కొన్ని రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, కోవిడ్‌ సమయంలో రైలు టికెట్ల ధరలు కూడా పెరిగి ప్రయాణికులకు భారంగా మారాయి. అయితే, రైళ్లలో కరోనాకు ముందున్న చార్జీలను అమలుచేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. లాక్‌డౌన్‌లు, కోవిడ్‌ నిబంధనల కారణంగా రైల్వే శాఖ సర్వీసులను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే కాగా… కొంతకాలంగా స్పెషల్‌ ట్రైన్‌ల పేరుతో పరిమితంగా మాత్రమే సేవలను అందిస్తోంది. అలాగే ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, అనవసరపు ప్రయాణాలను తగ్గించడానికి పెంచిన చార్జీలను కూడా తగ్గించనున్నారు.. తక్షణమే పాత చార్జీలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది రైల్వే బోర్డు.

మరోవైపు.. కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లను నడిపిన రైల్వేశాఖ.. రైళ్ల నంబర్లకు ముందు సున్నా ఉండేలా చర్యలు తీసుకుంది.. అయితే ఇప్పుడు పాత నంబర్లతోనే రైళ్లు తిరగనున్నాయి.. ఇక, రైల్వే చార్జీలపై క్లారిటీ ఇచ్చారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు, స్పెషల్‌ క్లాస్‌ ప్రయాణీకులకు కరోనాకు ముందున్న మాదిరిగానే చార్జీల్లో రాయితీలను పునరుద్ధరించనున్నట్టు వెల్లడించారు… రెండు మూడు నెలల్లో రైల్వే సర్వీసులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొన్నారు.. అయితే, జోన్ల పరిధిలో ఎప్పటి నుంచి రెగ్యులర్‌ సర్వీసులను నడపాలనే విషయంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని అధికారులు చెబుతున్నారు.