తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఉద్యోగాల భర్తీ!

తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న నిరుద్యోగులందరికీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటీని భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల పోస్టులు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి… ఇంకా రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో లెక్క తేలిన తర్వాతే వాటిని భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.