మంచి.. మానవత్వం లేని ప్రభుత్వం ఇది

• తూతూమంత్రంగా సాయం చేస్తాం అంటే కుదరదు
• ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరగాలి
• హామీ ఇచ్చిన విధంగా రూ.7 లక్షల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి
• పవన్ కళ్యాణ్ ఉదాత్త ఆశయంతో కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు
• అనంతపురం జిల్లా మన్నీల గ్రామ సభలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

రాజకీయం.. ఓట్ల పాకులాట.. ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టడం తప్ప, రైతుల కష్టం… వారికి కలుగుతున్న నష్టం గురించి కనీసం ఆలోచించని మంచి మానవత్వం లేని ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తోందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు విమర్శించారు. దేశంలోనే మొదటిగా ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ప్రారంభింపజేసి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనంతపురం జిల్లాను దేశవ్యాప్తంగా పరిచయం చేసి ఉన్నతంగా నిలిస్తే, ఆయన తనయుడు జగన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడిగా ఇంకా ఏదో చేస్తారని జనం నమ్మి ఓట్లు వేసి మోసపోయారని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా మన్నీల గ్రామ సభలో ఆయన మాట్లాడారు. సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మూడేళ్లలో అనంతపురం జిల్లాలో 170 మంది వరకూ ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరికి ఎవరికీ సాయం అందలేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వారికి కనీసం ప్రభుత్వం నుంచి సాయంగానీ, ఓదార్పుగానీ లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులకి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల దగ్గరకు వెళ్లి కనీసం ఓదార్పునిచ్చే సమయం కూడా లేకపోవడం అత్యంత శోచనీయం. పంట దిగుబడులు సరిగా రాక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, ప్రభుత్వాల నుంచి మద్దతు ధర రాక, ఆత్మాభిమానం నింపుకొన్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కనీసం ప్రభుత్వం స్పందించకుండా మిన్నకుండి పోవడం అత్యంత దారుణం. కనీసం వారి కుటుంబాలకు ఇస్తామన్న ఏడు లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ఇవ్వడం లేదు. జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతుంది అని తెలుసుకున్న వెంటనే అనంతపురం జిల్లా అధికారులు మృతి చెందిన కొందరు రైతుల వివరాలు తెలుసుకొని వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వేస్తున్నారు. ఈ పరిణామాన్ని ఆహ్వానిస్తున్నాం. అయితే కేవలం కొందరు రైతు కుటుంబాలకు మాత్రమే డబ్బులు జమ చేయడం కాదు… బలవన్మరణానికి పాల్పడిన ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వారికి ప్రభుత్వం నుంచి ఏడు లక్షల రూపాయలు అందాలి.
• ప్రతి రైతు కుటుంబానికి భరోసా కల్పిస్తాం
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తాం. ప్రతి రైతు కుటుంబానికి భరోసా ఇస్తాం. దీని కోసం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బును విరాళంగా ఇస్తున్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి రైతులను ఆదుకునేందుకు ఎందరో ముందుకు వస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వస్తున్నారు అని తెలుసుకున్న వెంటనే, ఎవరిని పరామర్శించడానికి వస్తున్నారో తెలుసుకొన్న అధికారులు వారి ఖాతాలోకి డబ్బులు జమ చేయడం కనిపించింది. సుమారు మూడు సంవత్సరాల తర్వాత మొద్దు నిద్ర వీడిన అధికారులు, అందరు రైతులకు న్యాయం చేయాలి. ఒక్క అనంతపురం జిల్లాలోనే మాకున్న సమాచారం ప్రకారం 170 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, కేవలం మీరు నలుగురు, ఐదుగురికి డబ్బులు పంచి మమ అనిపించడం తగదు.
• ఉన్న సబ్సిడీలనూ ఆపేశారు
జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మరింత పెరిగాయి. భూమిని నమ్ముకున్న రైతు ప్రభుత్వం నుంచి ఆశించేది ఏమన్నా ఉంది అంటే- చిన్న చిన్న సబ్సిడీలు, ఎరువులు, మంచి మద్దతు ధరతో తన పంటను కొనాలని కోరుకుంటారు. జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చీనీ పంటలకు వేసుకునే డ్రిప్ సిస్టం సబ్సిడీని పూర్తిగా ఆపేశారు. అసలే కరవులో ఉండే అనంతపురం జిల్లా రైతాంగానికి ఇది నిజంగా పెద్ద దెబ్బ. ఇదే గ్రామానికి చెందిన మహిళ ఈశ్వరి గారు వ్యవసాయానికి కరెంటు ఉండడం లేదని చెప్పారు. పంట చేతికి వచ్చే సమయానికి కరెంటు కోతలు తీవ్రంగా ఉండడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయరంగానికి ఆరు గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. కరెంటు కోతలతో రైతులు అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాని దుస్థితిలో, పంట చేతికి వచ్చే సమయంలో ఆవేదన చెందుతున్నారు.
• ఇచ్చే డబ్బులోనూ మోసం
మూడేళ్లుగా కనీసం కళ్లు తెరవని ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా డబ్బు పంపిణీ చేయడం బాగానే ఉన్నా, ఇచ్చే డబ్బులోనూ మోసం కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు 7 లక్షల రూపాయలు జమ చేయాల్సిన ప్రభుత్వం కేవలం లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం చేస్తోంది. ఒక మనిషిగా పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయలు రైతు కుటుంబాలకు ఇచ్చి ఆదుకుంటుంటే, ఒక వ్యవస్థగా ఉన్న ప్రభుత్వం కూడా లక్ష రూపాయలు ఇవ్వడం సరికాదు. నిజాయితీగా చిత్తశుద్ధిని నిరూపించుకొని, ప్రతి రైతు కుటుంబాన్ని పరామర్శించి ఏడు లక్షల రూపాయలు కచ్చితంగా ఇవ్వాల్సిందే. జగన్ రెడ్డి చేసిన అప్పులు డబ్బులు ఏమయ్యాయి? అవి ఎటు పోయాయి? రైతులను ఆదుకునేందుకు ఎందుకు మీకు చేయి రావడం లేదు..? ఇలాంటి మనసు, మానవత్వం లేని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
• రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు భరోసా యాత్ర
కౌలు రైతుల భరోసా యాత్రను రాష్ట్రవ్యాప్తంగా చేపడతాం. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 34 మందికి చెక్కులు ఇస్తున్నాం. మరోసారి అనంతపురం జిల్లాలో మరో ప్రాంతంలో పర్యటన ఉంటుంది. ఆ సమయంలో మరిన్ని కుటుంబాలను ఆదుకుంటాం. అనంతపురం జిల్లా పర్యటన తర్వాత మరో జిల్లాలో పర్యటన ఉంటుంది. జనసేన పార్టీ మాట ఇస్తే తప్పే ప్రశ్న ఉండదు. నిజాయితీతో కూడిన నిబద్ధత రాజకీయాలు చేస్తాం” అని చెప్పారు.