దిగి వచ్చిన ప్రభుత్వం… ద్వారపూడి రోడ్డుకు మోక్షం…

జనసేన విజయం…
ద్వారపూడి రోడ్డుకు మోక్షం…

కాగల కార్యం గంధర్వులు తీర్చారనేది నానుడి. సరిగ్గా అదే రీతిలో తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి మండపేట ఆర్ అండ్ బి రహదారి విషయంలో అక్షర సత్యమైంది. రెండున్నర ఏళ్ళుగా నిత్యం నరకం అనుభవిస్తున్న ప్రజల కష్టాలు తీరనున్నాయి. ఈ రోడ్ అంశంపై జనసేన రణభేరి మోగించింది. శ్రమదానంతో రోడ్ తాత్కాలిక మరమ్మతులు చేసింది. రాష్ట్ర స్థాయిలో ఈ అంశం పై చర్చ జరిగింది. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. తారు రోడ్ ఆఘమేఘాలపై నిర్మిస్తోంది. ఇది జనసేన విజయంగా సైనికులు చెబుతున్నారు. గతంలో సోషల్ మీడియాలో ఈ రోడ్ పై లెక్కలేనన్ని పోస్ట్ లు వచ్చాయి. ఇప్పనపాడు ప్రేవేటు గౌడన్ ల వద్ద చిన్న గోతులు కాలక్రమేణా రోడ్ ఆరు కిలోమీటర్లు పూర్తిగా ధ్వంసం అయింది. క్వారీ భారీ టిప్పర్ల వల్ల అడుగు లోతు గుంతలు ఏర్పడ్డాయి. వర్షం వస్తే చెరువుల మారింది. ఈ రోడ్ లో ఎందరో ప్రమాదాల బారిన పడి ఇంటికి పరిమితం అయ్యారు.కాళ్ళు, చేతులు విరిగి, నడుము విరిగి మరికొందరు ఇబ్బందులు పడ్డారు, పడుతూనే వున్నారు. ఈ రోడ్ దుస్థితి పై ద్వారపూడికి చెందిన కొందరు యువకులు ఏడాది క్రితం ఓ షార్ట్ ఫిలిం నిర్మిస్తే లక్షల వ్యూస్ వచ్చాయి. వైరల్ గా ఆ విడియో మారింది. అందులో నటులకు గుర్తింపు లభించింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఇక ప్రతిపక్ష పార్టీ టీడీపీ వరి నాట్లు నాటి నిరసన తెలిపి ఆరునెలలు పైనే అయింది. మండపేట పట్టణానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త రాష్ట్రపతి కార్యాలయంకు వెబ్ సైట్ లో ఈ రోడ్ దుస్థితి వివరిస్తూ ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు దీనిపై నిఘా విభాగం నుండి వివరాలు రప్పించి వాస్తవం అని రూఢి చేసుకుని సిఎం కార్యాలయంకు ఓ లేఖ ద్వారా రోడ్ తక్షణం నిర్మించాలని ఆదేశించింది. అయినా ఎక్కడా కదలిక రాలేదు. ఇక ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. ఆ దారి ఇంతే అని సరిపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ చొరవతో ఈ నెల 1న జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ రోడ్ లో శ్రమ దానం నిర్వహించారు. దుస్థితి కళ్ళకు కట్టినట్లు వివరించారు. జనసేన అధినేత సైతం ఈ రోడ్ అంశంపై సామాజిక మాధ్యమాల వేదికగా గళం వినిపించారు. దీంతో జనసేన కార్యక్రమంకు జనంలో అనూహ్య స్పందన వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం రహదారి నిర్మాణంకు జెండా ఊపింది. ఇప్పుడు రోడ్ నిర్మాణం వేగంగా జరుగుతుంది. ఎలాగైతేనే సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.