మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలి

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజనులో వరి ధాన్యం కొనుగోళ్ళ విషయంలో రైతులను అడుగడుగునా మోసం చేస్తూనే ఉందని జనసేన పార్టీ అవనిగడ్డ నాయకులు గుడివాక శేషుబాబు అన్నారు. అవనిగడ్డ జనసేన కార్యాలయంలో శేషుబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క పంటా కూడా సక్రమంగా రైతు చేతికి దక్కలేదన్నారు. పంట చేతికి అందే సమయంలో వర్షాలు, తుఫానులు రావటం, పంట నష్టపోవటం ఈ ప్రభుత్వంలో పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విపత్తుల వేళ ఆదుకుంటామని ప్రకటనలు ఘనంగా ఇస్తూ పరిహారం ఊసు ఎత్తటం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్ళ అంశంలోనూ ఆఫ్ లైనులో తోలుకోమని అధికారుల మాటలు నమ్మి పంట మొత్తం మిల్లులకు తోలిన రైతులకు ఇప్పటివరకు దిక్కు లేదన్నారు. రైతులు వేసిన పంటల వివరాలు ఈ క్రాప్ ద్వారా అధికారులు నమోదు చేయించారని, ఇప్పుడు పంటను ఎందుకు కొనుగోలు చేయలేక పోతున్నారని, ధాన్యం కొనుగోలు కోసం ప్రతిసారీ ప్రభుత్వం నుండి అనుమతులు రావాలి అంటూ కాలయాపన చేయడం విడ్డూరం అని ఎద్దేవా చేశారు. అకాల వర్షాల వలన మొక్క జొన్న పంట కూడా తడిసి పోయిందని, మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ సమస్యలు అన్ని పరిష్కారం చేయకపోతే ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గుడివాక శేషుబాబు, ఎంపీటీసీ బొప్పన భాను, ఎంపీటీసీ కటికల వసంత్, బచ్చు వెంకటనారాయణ, బచ్చు శ్రీహరి, నారే పాలెం శంకర్రావు, గుగ్గిలం అనీల్, చుండూరు రమేష్, భోగి రెడ్డి బాలాజీ, పప్పుశెట్టి శ్రీను, తుంగల నరేష్, కోసూరి అవినాష్, రేపల్లె రోహిత్, వార్డు మెంబర్ కమ్మిలి సాయి భార్గవ్, బొప్పన పృద్వి, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.