కె.విశ్వనాథ్ కు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో మరుపురాని చిత్రాలు అందించి, తెలుగు సినీ ఖ్యాతి దశదిశలా వ్యాపింపచేసిన  ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనకు ఎంతో ఇష్టమైన, ఎంతగానో గౌరవించే కే విశ్వనాథ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు చిరు.

గురుతుల్యులు, పితృసమానులు, మహోన్నత దర్శకులు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన కళాతపస్వి శ్రీ కే విశ్వనాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన తీసిన ప్రతీ చిత్రం ఓ ఆణిముత్యం,తెలుగు వారికి చిరస్మరణీయం. కే విశ్వనాథ్ ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ సందేశంలో పేర్కొన్నాడు. చిరు గతంలో కే విశ్వనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోను అందరితో పంచుకున్నాడు.

చిరంజీవితో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాందవుడు వంటి సూపర్‌హిట్ చిత్రాలనందించారు కే విశ్వనాథ్‌. ఆయన చిరంజీవితో కలిసి పలు చిత్రాల్లో కూడా నటించారు.