గ్రూప్-1 మెయిన్స్ గడువు పెంచాలి – అంజూరు చక్రధర్

శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వ‌హిస్తున్న గ్రూప్‌-1 మెయిన్ ప‌రీక్ష‌కి అభ్య‌ర్థులు ప్రిపేర్ అయ్యేందుకు మ‌రో 90 రోజులు అద‌న‌పు స‌మ‌యం కేటాయించాల‌ని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా అంజూరు చక్రధర్ మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి గారు ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు, అధికారంలోకి వ‌స్తే ఏటా జాబ్ క్యాలెండ‌ర్ విడుదల చేస్తామ‌ని హామీ ఇచ్చి, సీఎం అయ్యాక ఆ మాటే మ‌రిచిపోయార‌ని ప్ర‌శ్నించారు. ఓ వైపు ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ కాక‌, మ‌రోవైపు ప్ర‌యివేట్ ఉద్యోగాలు లేక యువ‌త నిరాశానిస్పృహ‌ల‌కు లోన‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నాలుగేళ్ల త‌రువాత విడుద‌ల చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల‌కు ప్రిపేర్ అయ్యే స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం వారిని ఆందోళ‌న‌కి గురి చేస్తోంద‌న్నారు. ప్రిపరేషన్ కోసం 90 రోజుల కంటే తక్కువ సమయం ఇవ్వడం, మెయిన్స్ పరీక్షకు సిద్ధం కావడానికి ఏడు పేపర్లు పూర్తి చేయాల్సి ఉన్నందున టెన్ష‌న్ ప‌డుతున్నార‌ని అన్నారు.మెయిన్స్ ప్రిప‌రేష‌న్‌కి ఇచ్చిన గ‌డువుకి అద‌నంగా మ‌రో 90 రోజుల స‌మ‌యం కేటాయించాల‌ని ప్రభుత్వాన్ని కోరారు.