తెలంగాణ ఆన్‌లైన్‌ క్లాసుల మార్గదర్శకాలు

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల భాద్యతలు మండలస్థాయిలో ఎంఈవోలు, జిల్లాస్థాయిలో డీఈవోలు నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరియు సెప్టెంబరు-1 నుంచి ప్రారంభం కానున్నఆన్‌లైన్‌ ప్రసారాలను విద్యార్థులు ఎలా వినియోగించుకోవాలనే విషయాలపై స్పష్టతనిచ్చింది. ఆన్‌లైన్‌ తరగతులను విజయవంతం చేయడంపై కొన్ని వారాలుగా సుదీర్ఘంగా చర్చించిన విద్యాశాఖ.. ఉపాధ్యాయుడి నుంచి డీఈవో వరకు ప్రతి ఒక్కరూ నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఇందులో స్పష్టం చేసింది. తరగతుల నిర్వహణలో విద్యార్థులకు తల్లిదండ్రులు సహకరించాలని కోరింది.

3-5 తరగతుల విద్యార్థులకు రోజుకు గంటన్నర, 6-8 తరగతులకు 2 గంటలు, 9-10 తరగతులకు 3 గంటల పాటు తరగతులు నిర్వహిస్తారు. అన్ని తరగతులు సెప్టెంబరు-1 నుంచి ప్రారంభమవుతాయి.

ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్న అన్నిరకాల వనరులను ఉపయోగించుకుని ఆన్‌లైన్‌ తరగతులను విజయవంతం చేయాలి. టీసాట్‌, దూరదర్శన్‌లో ప్రసారాల సమయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందుగానే తెలపాలి. ప్రతి విద్యార్థి ప్రసారాల ద్వారా పాఠం విన్న అనంతరం వర్క్‌షీట్లు పూరించేలా చూడటం. సోషల్‌ మీడియా, ఫోన్‌, ఇతర మార్గాల ద్వారా విద్యార్థులతో అనుసంధానమై ఉండాలి. ఒక్క విద్యార్థి కూడా ఆన్‌లైన్‌ తరగతులకు దూరం కాకుండా ప్రతి ఉపాధ్యాయుడు తనకంటూ ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి.

తల్లిదండ్రులు దూరదర్శన్‌, టీసాట్‌ ద్వారా ప్రసారాలను చూసేలా పిల్లలను ప్రోత్సహించాలి. పాఠాలు వినే సందర్భంలో పర్యవేక్షించాలి. సరిగా కూర్చోవడం, లాంటి అంశాలను వారికి వివరించాలి. డీఈవోలు దూరదర్శన్‌, టీసాట్‌ ప్రసారాలకు అంతరాయం కలగకుండా స్థానిక కేబుల్‌, డీటీహెచ్‌ ఆపరేటర్లతో మాట్లాడాలి. ప్రసారాల సమయంలో నిరంతర విద్యుత్తు ఉండేలా డీఈవో/ఎంఈవోలు విద్యుత్తు అధికారులతో మాట్లాడాలి. ఆన్‌లైన్‌ తరగతులు, విద్యార్థుల సమస్యలపై ఎంఈవోలు ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహించాలి.