ఆసియాలోనే అతిపెద్ద నూలుమిల్లు తెరవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జనసేనానిని కోరిన గుంతకల్ జనసేన

తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో అనంత జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టి.సి వరుణ్, జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ సూచనలు మరియు సహకారంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి గుంతకల్ స్పిన్నింగ్ మిల్ ను ఓపెన్ చేయాలి లేదా ఉపాధి అవకాశాల కొరకు గార్మెంట్ హబ్ గా (ప్రత్యామ్నాయ పరిశ్రమ) అయినా ఏర్పాటయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, జిల్లా కార్యనిర్వాహణ కమిటీ సభ్యుడు ఎస్.కృష్ణ, వెంకటేష్ విన్నవించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో గుంతకల్ నాయకులు మాట్లాడుతూ గతంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్పిన్నింగ్ మిల్లు పునఃప్రారంభం చేయాలని పోరాటాలు చేసాం, మీరు కూడా మాకు మద్దతుగా ప్రత్యక్షంగా స్పిన్నింగ్ మిల్ దగ్గర పబ్లిక్ మీటింగ్ ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పట్లో మీ పోరాటం వల్ల ప్రభుత్వంలో కాస్త కదలిక వచ్చినా కొద్ది రోజులకి గత పాలకులు, ప్రస్తుత పాలకులు స్పిన్నింగ్ మిల్ అంశం మర్చిపోయి గాడనిద్రలోకి వెళ్లారు. మరలా మీ గళం వినిపించి న్యాయం చేయాలని మనవి చేశారు. మూతపడ్డ నూలు మిల్లులో కోట్లు విలువ చేసే సామాగ్రి ఉంది వీటికి కాపలాగా 9 మంది వాచ్ మెన్ లు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. వారికి కొన్ని సంవత్సరాలుగా జీతాలు చెల్లించడం లేదు. వారి జీవనం ఎలా సాగించాలో తెలియక మనస్తాపం చెందుతున్నారు. ఇటీవల ఇద్దరు వాచ్ మెన్ లు అనారోగ్యం బారిన పడి మృతి చెందారు. కనీసం మృతి చెందిన వాచ్మెన్ల కుటుంబాలకు కూడా వేతనాలు చెల్లించక పోవడం దారుణమన్నారు. ఈ మిల్లుకు లిక్విడేటార్ గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. ఆయన స్పందించి వేతనాలు చెల్లించి ఆదుకునేలా చూడాలని, అలాగే గత 30 సంవత్సరాలుగా గుంతకల్ పట్టణంలో ఆఫ్ కోపరేటివ్ స్పిన్నింగ్ మిల్ మూతపడడం ద్వారా అప్పట్లో దాదాపుగా 3,000 మంది జీవన ఉపాధి కోల్పోయారు. కొంతమంది జీవన ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు పోయారు. ఇప్పుడు గుంతకల్ పట్టణంలో జీవనం సాగించాలంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు చదువుకొన్న యువతీ, యువకులు పెద్ద ఎత్తున మహానగరాలకు వలసలు పోతున్నారు. ఇప్పుడు గుంతకల్ పట్టణం అభివృద్ధి చెందాలంటే ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కొన్ని వేల మందికి జీవన ఉపాధి కలిగించే స్పిన్నింగ్ మిల్లును పునఃప్రారంభించాలి లేదా ప్రత్యామ్నాయ పరిశ్రమను అయినా ఏర్పాటు చేయాలని, గతంలో మా తరఫున గట్టిగా నిలబడ్డారు మీకు మా కృతజ్ఞతలు, ఇంకొకసారి మా తరఫున ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి శాశ్వత పరిష్కారం చూపాలని నూలు మిల్లు కు చెందిన స్థలం అమ్మకం విషయంలో హౌసింగ్ బోర్డు అధికారులు, మిల్లు అధికారుల మధ్య వివాదం చోటు చేసుకున్న పరిస్థితుల విషయాలు మరియు గత కోర్టు ఆర్డర్ లు అన్నియు డాక్యుమెంట్ రూపంలో జనసేనానికి అందజేశారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ త్వరలో వీటన్నిటినీ మరొక్కసారి పరిశీలించి ఆంధ్ర స్పిన్నింగ్ మిల్లు పునః ప్రారంభించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా జనసేన పార్టీ పెద్దఎత్తున పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.